శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము-2 | sripada.co

    శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం  అధ్యాయము-2  శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం భాగము 1

నేను (శంకరభట్టు) మరుత్వమలై నందు కలిగిన వింత అనుభవములను మనసులో మననం చేసుకొంటూ శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యనామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేయసాగితిని. మార్గ మధ్యములో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించితిని. ఎవరినీ ఏమీ యాచించకుండగనే నాకు భోజనము సిద్ధించెడిది. ఇది ఒక అపూర్వ అనుభవము. పాండ్య దేశంలోని కదంబవనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమముగా తగ్గుతున్నట్లు అనిపించినది. ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన శివలింగం ఉన్నది. అచట ఈశ్వర దర్శనం అయిన తరువాత నా కాళ్ళు బరువెక్కసాగినవి. నేను ఆ శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగితిని.దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించినది. అందు శ్రీ సిద్ధేంద్రయోగి అనే మహాత్ములున్నారు. వారి పాదపద్మములకు ప్రణమిల్లిన తదుపరి నా శరీరం దూదిపింజ కంటె కూడా తేలికగా అయినది. నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉన్నది కాని శరీరం యొక్క బరువు దాదాపు శూన్యం అనిపించినది. కరుణాంతరంగులైన ఆ మహాగురువులు ప్రేమతో నా శిరస్సు నిమిరి "శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు" అని ఆశీర్వదించినారు.శ్రీ యోగివరేణ్యులు యీ విధంగా సెలవిచ్చినారు. "నాయనా! శంకరభట్టూ! నీవు దర్శించిన ఆ శివలింగము మహా మహిమాన్వితమైనది. పూర్వము దేవేంద్రుడు అనేకమంది రాక్షసులను జయించినాడు. కాని ఒక రాక్షసుడు తప్పించుకొని పారిపోయి తపస్సు చేయసాగినాడు. అయితే తపస్సులో ఉన్న ఆ రాక్షసుని ఇంద్రుడు నిర్దాక్షిన్యముగా చంపి వేసినాడు. తపస్సులో ఉన్న వాని హత్యా పాతకము వలన దేవేంద్రుడు కళా విహీనమైపోయాడు.తన పాప ప్రక్షాళన కోసం ఇంద్రుడనేక పుణ్య స్థలముల సందర్శనం చేసినాడు. పాండ్య దేశంలోని యీ కదంబవనము నందలి శివలింగము మహా శక్తివంటమగుట వలన ఇంద్రుడు కదంబ వనం చేరుసరికి అతనిలో నివసిస్తున్న పాపాల సమూహము ఆకస్మాత్తుగా తొలగిపోవడం వానికి ఆశ్చర్యాన్ని కలుగాజేసినది. ఈ క్షేత్రములో ఏదో గొప్పదనమున్నదని నలుమూలలా పరిశీలించగా ఇంద్రునికి ఒక శివలింగము కనిపించినది. ఇంద్రుడు భక్తితో ఆ లింగాన్ని అర్చించి, ఆ స్వయంభూ శివలింగానికి ఆలయం నిర్మించాడు. ఆ విధముగా అది దేవేంద్ర ప్రతిష్టితమైన శివలింగము. ఆ శివలింగము సమస్త పాపహరం, సర్వమంగళప్రదం. విశేష పుణ్యవంతులయిన వారికి మాత్రమే ఆ శివలింగ దర్శనం సాధ్యం. అయితే శ్రీ దత్తప్రభువుల భక్తులకు అయాచితముగా, అప్రయత్నముగా పుణ్యపురుషుల సంగమము, పుణ్యస్థల సందర్శనము కలుగుచుండును.నేను తిరిగి శ్రీ సిద్ధయోగీంద్రుల పాదపద్మములకు ప్రణమిల్లితిని. శ్రీ సిద్ధయోగీంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనమునకు పొమ్మనిరి. నేను తిరిగి ఆ ప్రదేశమునకు వెళ్ళు సరికి అక్కడ బహు సుందరమైన శివాలయమున్నది. కాని అది నేను గతంలో దర్శించిన ఆలయము కానేకాదు. నేను అక్కడ విచారించగా అది శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయమని, నేను వున్నది మధురానగరమని తెలిసినది.

నేను దేవతామూర్తుల దర్శనం చేసుకుని శ్రీ సిద్ధయోగీన్డ్రుల ఆశ్రమం వద్దకని వెళ్ళితిని. ఆ ప్రాంతమంతయును జనసమూహములతో నిండి యున్న పట్టణప్రాంతముగా కనిపించినది. ఎంత వెదికినను శ్రీ యోగీంద్రుల ఆశ్రమం కనిపించలేదు. నేను శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామస్మరణ చేయుచూ నాకు తోచిన దిక్కుగా పోసాగితిని. సూర్యాస్తమయమాయెను. చీకటి పడుచుండెను. నా వెనుక నుండి కాంతి ప్రసారమొకటి వచ్చుచుండుట గమనించితిని. నేను వెనుకకు తిరిగి చూచునప్పటికి మూడు తలలు కలిగిన పెద్ద సర్పమొకటి నా వెంట వచ్చుచుండెను. మూడు తలలకును మూడు మణులున్నవి. ఆ మణుల నుండి కాంతిప్రసారము జరుగుచుండెను. నేను భయవిహ్వలుడనైతిని. నేను ఆగిన యెడల ఆ దివ్యసర్పము కూడా ఆగుచుండెను. నా గుండెల లోతు నుండి అప్రయత్నముగా శ్రిపాదుల వారి దివ్యనామము వచ్చుచుండెను. అట్లే అప్రయత్నముగనే నా నోటి నుండి శ్రీపాదుల వారి దివ్యనామము ఉచ్చరింపబడుచుండెను. నేను ఎట్టకేలకు శ్రీసిద్ధ యోగీంద్రుల ఆశ్రమము చేరితిని. వెంటనే ఆ దివ్య సర్పమును, ఆ కాంతియును కూడా అదృశ్యమయినవి.

శ్రీ సిద్ధ యోగీంద్రులు నన్ను అత్యంత కరుణతో ఆదరించిరి. వేయించిన వేడివేడి శనగలను అరటి ఆకులో నాకు ప్రసాదముగా యిచ్చిరి. నేను కడుపారా భుజించితిని. నేను భోజనము చేయుచున్నను గుండె దడ తగ్గలేదు. శ్రీ సిధ యోగీంద్రులు ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరిరి. తదుపరి ఎడమ రొమ్మును నిమిరిరి. ఆ తరువాత తమ దివ్యహస్తముతో న శిరస్సును స్పృశించిరి. నేను గుండె దడ తగ్గుట గమనించితిని. నా ఊపిరితిత్తుల నుండి ఏవో దుష్టవాయువులు బయల్వెడలుచున్నట్లు అనిపించినది. నా మనస్సు నందు నిండియున్న చెడ్డ ఊహలు, దుష్టసంకల్పములు బయటకు పోవుచున్నట్లు అనిపించింది. నా శరీరమంతయును ఉష్ణము హెచ్చి మత్తులో నిండినట్లు ఉండెను.


శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 2

శ్రీదత్తుని మహిమ, శ్రీపాదుని అనుగ్రహము సంపాదించుటకు వలయు యోగ్యతలు


అపుడు శ్రీ సిద్ధయోగీంద్రులు యీ విధముగా సెలవిచ్చిరి. "శంకరభట్టూ! నీవు మొట్టమొదట దర్శించిన శివలింగము, తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరువేరు కాదు. నీకు ఈ రకమైన అనుభవము ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ కనుక అట్లు ప్రసాదించడమైనది. అనగా కాలమును వెనుకకు తిప్పి దేవేంద్రుడు ప్రతిష్టించిన శివలింగమును, అప్పుడు ఉన్న యదార్థములైన పరిసరములను నీకు చూపించడమైనది. నీవు దర్శించు సృష్టిని, సృష్టియని భావించుటయే మాయ. అంతయును చైతన్య స్వరూపము. శ్రీదత్త ప్రభువుల సంకల్పము వలన భవిష్యత్తు వర్తమానముగా మారవచ్చును. వర్తమానము భూతకాలముగా మారవచ్చును. భూతకాలము వర్తమానముగా రూపుదిద్దుకొనవచ్చును. శ్రీదత్తప్రభువుల చైతన్యము నిత్యవర్తమానము. గతములో జరిగినది, ప్రస్తుతము జరుగుచున్నది, భవిష్యత్తులో జరుగాబోవునది అంతయును వారి సంకల్పము ననుసరించియుండును. ఒక విషయము జరుగుటకు గాని, జరగకుండా ఉండుటకు గాని, వేరొక వినూత్న పద్ధతిలో జరుగుటకు గాని శ్రీదత్త ప్రభువు యొక్క సంకల్పమే ప్రధానము. ఏ మహాసంకల్పముతో సృష్టి, స్థితి, లయములు జరుగుచున్నవో, ఆ మహాసంకల్పము యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయులు. వారే ప్రస్తుతము శరీరధారియై శ్రీపాద శ్రీవల్లభులుగా యీ భూమండలమున అవతరించిరి. శ్రీ పీఠికాపుర వాస్తవ్యులు వారిని సరిగా గుర్తించలేదు. గురుతత్వమును గ్రహించుటలో వారు విఫలులైరి. కురువపురము నందలి మత్స్యకారులవంటి అల్పజ్ఞులు కూడ బ్రహ్మజ్ఞానమును పొందిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి కరుణను పొందవలెనన్న మనలోని అహంకారము నశించవలెను, అన్ని రకముల మదములును క్షీనించవలెను. అప్పుడే వారి శక్తియును, వారి అనుగ్రహమును, వారి యదార్థస్థితియును మనకు అవగతమగును.

దేవేంద్ర ప్రతిష్టితమైన ఆ శివలింగమును ధనంజయుడను ఒక వ్యాపారి గమనించి, ఆ విషయమును ఆ రాజ్యమునేలు కులశేఖర పాండ్యులకు విన్నవించెను. శివాజ్ఞానుసారముగా కులశేఖర పాండ్యుడు దానిని అభివృద్ధిపరచి, అక్కడ ఒక నగరమును నిర్మించి దానికి మధురానగరమని నామకరణం చేసెను. వాని కుమారుడైన మలయధ్వజ పాండ్యుడు సంతానప్రాప్తికై పుత్రకామేష్టి చేయగా, ఆ యజ్ఞగుండము నుండి అయోనిజగా మూడేళ్ళ పసిబాలిక ఆవిర్భవించెను. ఆమెయే మీనాక్షీదేవి. ఆమె సుందరేశ్వరుని వివాహమాడెను. శివ జటాజూటము నుండి ఆవిర్భవించిన వేగవతీ నది యీ మధురానగరమును మరింత పవిత్రపరచుచున్నది. మహావిష్ణువు స్వయముగా కన్యాదానము చేసి మహా వైభవోపేతముగా మీనాక్షీ సుందరేశ్వరుల దివ్యకళ్యాణము జరిపించెను.


శ్రీ సిద్ధ యోగీంద్రుల వారు యీ విధముగా సెలవిచ్చిరి. "నాయనా! శంకరభట్టూ! సృష్టినందలి ప్రతివస్తువునుండియూ ప్రకంపనలు కలుగుచుండును. ఎంతో వైవిధ్యమున్న యీ ప్రకంపనములవలన యితర వస్తువులతో ఆకర్షణ, వికర్షణలు కలుగుచుండును. స్థూల, సూక్ష్మ కారణశరీరములందు పుణ్యకర్మముల వలన పుణ్యరూపమైన ప్రకంపనలు, పాప కర్మముల వలన పాపరూపమైన ప్రకంపనలు కలుగుచుండును. పుణ్యవిశేషముల వలన పుణ్యపురుషులతో సమాగమము, పుణ్యస్థలముల దర్శనము, పుణ్య కర్మములయందు ఆసక్తి కలిగి పుణ్యము వృద్ధిచెందుచుండును. ఆ పుణ్యము వృద్ధినొంది, పాపము క్షీనించిననేగాని శ్రీదత్తప్రభువుల వారియందు మనకు నిశ్చల భక్తి కుదరదు. కాల, కర్మ కారణ వశమున రకరకములయిన సంఘటనలు జరుగుచుండును. శ్రీవల్లభుల వారికి నీపై గల అపార కృపవలననే నీవు యిచ్చతకు రాగలిగితివి."

నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆశ్చర్యపడుచూ శ్రీవల్లభుల వారి దివ్య శ్రీచరణములను వదలకూడదనియూ, ఎప్పుడు కురువపురమునకు చేరుదునాయనియూ మనస్సులో తహతహలాడుచుంటిని.

మరునాడు ఉదయమునన మేల్కొనగనే నేను సంభ్రమాశ్చర్యములకు లోనయితిని. ఏలనన నేను ఒక ఎత్తైన గుట్టమీద గల రావిచెట్టు మూలమున ఉంటిని. చుట్టుప్రక్కల జనసంచారము లేదు. రాత్రియందు నేను శ్రీ సిద్ధ యోగీంద్రుల ఆశ్రమములో నున్నదంతయును భ్రమ మాత్రమేనా ? యని మనసున సందేహము పొడగట్టెను. శ్రీ సిద్ధయోగీంద్రులు మాయావియా? దక్షుడా? మంత్రికుడా? యని మనసున సందేహము కలుగసాగెను. శ్రీ సిద్ధయోగీంద్రులు శ్రీ దత్తప్రభువు గురించి చెప్పిన వాక్కులు నా కర్ణపుటములందు మారుమ్రోగసాగెను. నన్ను యిటువంటి సంకట పరిస్థితిలో ఉంచినందుకు శ్రీపాద శ్రీవల్లభులకు ఏమి ప్రయోజనము? అని కూడా తలంచితిని. మనస్సులో రకరకముల సంకల్ప వికల్పములు కలుగుచుండెను. నా మూటా ముల్లె సర్దుకుని తిరిగి ప్రయాణము సాగించితిని.

శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 3

ఉదయము నుండి మధ్యాహ్నము వరకు ప్రయాణము సాగినది. అక్కడ చిన్న చిన్న యిండ్లుగల ఒక పల్లెను చూచితిని. నాకు ఆకలి బాధ ఎక్కువయ్యెను. నేను బ్రాహ్మణుడను. బ్రాహ్మణుల ఇంటదప్ప వేరొక చోట భుజించజాలను. సంభారములేవరయినా సమకూర్చిన యెడల స్వయంపాకమును చేసికొని భుజించెదనని తలచితిని.  ఆ పల్లెలో బ్రాహ్మణులెవరయినా ఉన్నారేమోయని సందేహము కలిగి ఆ పల్లెప్రజలను అడిగితిని. వారిలో ఒకరు, "అయ్యా! మేము కొండజాతి ప్రజలము. నేను యీ గూడెమునకు పెద్దను. మా పల్లెలో బ్రాహ్మణులు ఎవరునూ లేరు. మీకు అభ్యంతరము లేనియెడల మా నుండి పండ్లు, పుట్టతేనె స్వీకరించవలసినదని చెప్పెను." 'మార్గమధ్యే శూద్ర వదాచరేత్' అని యున్నది గనుక మార్గమధ్యమున ఎవరేమి పెట్టినను తప్పుకాదని తలచితిని. వారు కొండకోనలలోనే లభ్యమగు పండ్లు, పుట్టతేనె తెచ్చి నా ఎదుట బెట్టిరి. నేను తినబోవునంతలో ఎక్కడ నుండియో ఒక కాకి వచ్చి నా తలపై పొడవసాగెను. దానిని తోలివేయుటకు నేను ప్రయత్నించి విఫలుడనైతిని. ఇంతలో మరికొన్ని కాకులు వచ్చి నా శరీరమున తమ యిష్టము వచ్చిన చోట్ల పొడువసాగినవి. నేను భయవిహ్వలుడనై పరుగెత్తసాగితిని. అవి నన్ను వెంబడించుచునేయున్నవి. ఆ పల్లె ప్రజలలో ఎవరూ నాకు సహాయము చేయువారు లేకపోయిరి. నాతో గతములో మాట్లాడిన పల్లె పెద్ద యిట్లనెను. "ఆహా! ఏమి విడ్డూరము! మా ప్రాంతము నందలి కాకులు ఎవరికినీ హాని చేయవు. నీకు హాని చేయుటకు యింత ఉగ్రరూపమున ఉన్నందులకు మాకెంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు ఎవరయినా సిద్ధపురుషుని నిందించుటయో, అవమానించుటయో చేసియున్నావు. వారి శాపఫలితముగా యిటువంటి శిక్షను పొందుచున్నావు. మేము అడ్డుకొన్న యెడల మేమును ఋషీశ్వరుల ఆగ్రహమునకు గురి కావలసి వచ్చును. అందుచేత దైవలీలల ఘటనాక్రమమును మార్చుటకు మేము ప్రయత్నించము. అన్యథా భావించవలదు." అని మిన్నకుండెను.నాకు సమకూర్చబడిన పండ్లను, పుట్టతేనెను నేను స్వీకరిన్చాలేకపోయితిని. నా శరీరమంతయును రక్తసిక్తమయ్యెను. నేను పరుగుపెట్టుచున్ననూ కాకులు నన్ను వెంటాడి మరీ హింసించినవి. నా దుర్దశకు ఎంతగానో చింతించితిని. నేను శ్రీ సిద్ధయోగీంద్రులను శంకించినందులకు వారు నన్ను శపించిరా ? మరి నాకు శ్రీపాద  వల్లభుల దర్శనప్రాప్తి కలుగునని వారు ఆశీర్వదించితిరి కదా! గత జన్మములోని పాపములన్నియును క్షీనించినగాని నాకు శ్రీదత్తప్రభువు యొక్క దర్శనము కాదేమో! నేను ఎన్ని పాపకర్మలను మూటగట్టుకొని వచ్చితినో! అవి అన్నియును నశింపవలెనన్న యిటువంటి శిక్షలు ఇంకెన్నింటిని నేను అనుభవించవలసివచ్చునో! ఆహా! శ్రీవల్లభుల దర్శనప్రాప్తి కలుగునన్న ఆశీర్వాదములో యిన్ని సంకటములు, ఉపద్రవములు యిమిడి ఉన్నవా? హా! దైవమా! నన్నింకను ఎన్ని శిక్షలకు గురిచేయ దలచితివో కదా! ఇంక నన్ను కాపాడువారెవ్వరూ? శ్రీపాద శ్రీవల్లభా! శరణు! శరణు! అని తలచుచూ నెమ్మదిగా అడుగులు వేసికొనుచూ ఒక మేడిచెట్టు మొదలుకు చేరుకొంటిని. శ్రీదత్తప్రభువుల నివాస స్థానమైన యీ మేడిచెట్టు నన్ను రక్షించునని తలచితిని. కాని శ్రీదత్తలీల దానికి విరుద్ధముగా ఉన్నది. నా శరీరము నుండి ఇదివరకెన్నడునూ లేని ఒక వాసన బయలువెడలుచుండెను. ఈ వాసన చేత ఆకర్షించబడియో, లేక విధి వైపరీత్యమో నాకు తెలియదు గాని, పెద్దపెద్ద విషసర్పములు ఒకదాని తరువాత ఒకటి నా వద్దకు పరుగు పరుగున వచ్చి నన్ను కరచి వెళ్లిపోవుచుండెను. ఇదివరకు కాకులవలన బాధలను పొందితిని. ఇప్పుడు విషసర్పములు కరచుట వలన శరీరమంతయు విషపూరితమగుచుండెను. నోటినుండి నురగలు వచ్చుచుండెను. గుండెయందు బలము తగ్గుచుండెను. ఏ క్షణమునందైననూ నేను మరణించుట ఖాయమని తలంచితిని.

సాయంకాలమగుచుండెను. కొందరు రజకులు ఆ మార్గమున వెళ్ళుచుండిరి. బట్టలను ఉతికి, ఆరవైచి, ఆరిన బట్టలను మూటలుగా గట్టి, గాడిదల మీద పెట్టుకుని వెళ్ళుచుండిరి. వారు నా దురవస్థను గమనించి, నేను బ్రాహ్మణుడను గనుక ముట్టుకొనవచ్చునా లేదా అని కొంతసేపు తటపటాయించిరి. ఆలస్యము చేసిన యెడల ప్రాణములకు ముప్పు రావచ్చును కనుక, ప్రాణములను కాపాడుటే ముఖ్య కర్తవ్యమని భావించి ఒక గార్ధభముపై నన్ను కూర్చుండబెట్టుకొని వారి గ్రామమునకు తీసుకొనిపోయిరి. ఆ చర్మకారులలో ఒకనికి విష సంబంధ వైద్యము తెలిసి యుండెను. దుర్గంధ భరితమైన ఆ ప్రాంగణములో నన్నొక నులక మంచముపైనుంచిరి. ఆ చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలికల రసమును దీసి నా చేత త్రాగించెను. పాములు కరచిన చోట్ల కొన్ని ఆకులను కట్టెను. రావి చెట్టు యొక్క లేత ఆకులను కోసెను. ఆ ఆకులనుండి రసము పాలవలె స్రవించుచుండెను. ఆ ఆకుల కాడలను రెండు చెవులలోను బెట్టెను. నాకు విపరీతమైన బాధ కలుగాసాగెను. నేను లేచి పారిపోవుటకు ప్రయత్నించితిని. ఇద్దరు బలిష్ఠులైన మనుష్యులు నన్ను పట్టుకొనియుండిరి. నేను నిస్సహాయముగా ఉంటిని. ఆ వైద్యుడు తన సహాయకులతో, "విషము రావి ఆకులలోనికి చేరును. ఆ తరువాత విషపూరితమైన యీ ఆకులను దగ్ధము చేయవలెను. విషము రావి ఆకులలోనికి ఎంత ఎక్కుచున్న యితడు అంత గట్టిగా రోదించును. ఇతనిని గట్టిగా పట్టుకొనుడు." అనెను.


కొంతసేపటికి విషము విరిగినది. నేను స్వస్థుడనైతిని. ఆ రాత్రి యంతయునూ నేను చర్మకారుని యింటిలోనే ఉంటిని. చర్మకారుడు రాత్రి అంతయూ దత్త దిగంబరా! దత్త దిగంబర! శ్రీపాదవల్లభ దిగంబర! అని సంకీర్తనము చేయుచుండెను. నేను మంచము మీద పడుకొనియుంటిని. అత్యంత శ్రావ్యమైన ఆ నామమును వినునపుడు నా హృదయము ఉప్పొంగసాగెను. మరుక్షణములోనే నేను ఉత్తమకులమైన బ్రాహ్మణవంశమునందు జన్మించిన వాడిననియు, అతడు అంత్యకులజుడైన చర్మకారుడనియు బాధ కలుగజొచ్చెను.

శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 4

 శంకరభట్టుకు చర్మకారుని ఉపదేశము

సంకీర్తనానంతరము ఆ చర్మకారుడు నా వద్దకు చేరెను. అతని కన్నులలో కరుణారసము పొంగిపొరలుచుండెను. అతని నేత్ర ద్వయము ఆత్మానుభూతిని సూచించుచున్నట్లుండెను. ఇతడు ఎవరైనా యోగిగాని కాదు గదా! అని మనమున సందేహము పొడసూపెను. అతడు నా వైపు చూచి ఇట్లు చెప్పసాగెను. "అయ్యా! నా పేరు వల్లభదాసు. నేను చర్మకారుడనే! అంత్యజుడనే! సందేహము లేదు. అయితే నేను మీకు కొన్ని సంగతులను చెప్పదలచినాను. మీ పేరు శంకరభట్టు అనియూ, మీరు శ్రీపాద శ్రీవల్లభులవారి దర్శనమునకు వెళ్ళుచున్నారనియూ, అంతేగాక మీరు కాకులచేతను, సర్పములచేతను, ఎందులకు బాధపెట్టబడినారో కూడా నాకు తెలియును." అనెను.

నేను దిగ్భ్రాంతికి లోనయితిని. బహుశ ఇతడు కొంత జ్యోతిష్యవిద్యలో పరిశ్రమ చేసి పాండిత్యమును సంపాదించెననుకొంటిని. వెంటనే వల్లభదాసు యిట్లనెను. "అయ్యా నేను జ్యోతిషుడను కూడా కాను. శ్రీ పీఠికాపురము- పాండిత్య ప్రకర్ష కలిగినవారికి పుట్టినిల్లు. సాక్షాత్తు సాంగవేదార్థ సామ్రాట్టు అని పేరు పొందిన పండిత మల్లాది బాపన్నావధానులు గారు నివసించిన పుణ్యభూమి. వేదములు ఏ పరతత్త్వమును గురించి వర్ణించినప్పుడు నేతి నేతి అని అలసిపోయినావో, ఆ పరతత్త్వమే శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించిన పుణ్యభూమి. శుష్క వేదాంతము, అర్థము లేని తర్కవితర్కములు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమును పొందించజాలవు. శ్రీవల్లభుల కరుణ పొందుటకు పాండిత్య ప్రకర్షల అవశ్యకతయే లేదు. పైగా పాండిత్యజనిక అహంకారము వలన మనము వారి నుండి ఎంతో దూరముగా విసిరివేయబడుదుము. 


నిన్న పొడిచిన కాకులు గత జన్మములో పీఠికాపురములో నివసించిన మహా మహా పండితులు. వారు శ్రీవల్లభుల దివ్య తత్త్వమును గుర్తించలేక, వారిని దత్తప్రభువుగా గమనించలేక జీవితమంతయును వ్యర్థము గావించుకొనిరి. వారు వేదమును తలక్రిందగా వప్పజెప్పగలరు, కాని ఫలితమేమి? క్రమము, ఘట, జట, స్వాధ్యాయలు అను మాటలను పలుకుచూ వారు తమ అహంకారమును ప్రదర్శించుకొనిరి. వారు చనిపోయిన తరువాత స్వర్గాలోకమునకు పోయిరి. ఇంద్రుడు వారిని ఎంతగానో కొనియాడెను. ఆహా! మీరు క్రమాంతులు, మీరు ఘనాపాటి, మీరు జటి, ఓహో! మీరు తర్కప్రవీణులు, ఎంతటి భాగ్యము! ఎన్ని వందల, ఎన్ని వేల మార్లు వేదమును వల్లె వేసియుండిరి? ఎంత పుణ్యము! ఎంత పుణ్యము! ఆ పుణ్య విశేషము చేతనే మీరు ఇంద్రలోకమునకు రాగలిగితిరి, అని పొగడ్తలతో ముంచెత్తెను. ఇంద్రలోకములందలి సమస్తములైన వారలు, వారిని ఎంతగానో పొగిడిరి. అయితే వారు ఆకలిచే నకనకలాడిరి. స్వర్గమున అమృతము లభించును, దాని వలన ఆకలి దప్పులుండవు అని వారు వినియుండిరి. వారి బాధను ఎవరూ పట్టించుకొనకపోవుటచే వారు దేవేంద్రుడినే స్వయముగా అడిగిరి. దానికి ఇంద్రుడు ఇట్లు సమాధానము చెప్పెను. "వేదము ప్రభువు యొక్క ఉచ్చ్వాసనిశ్వాస రూపము. ప్రభువు అనంతుడు, మరణరహితుడు. అందుచేత వేదములు కూడా అనంతములైనవి. సర్వ ధర్మములకును మూలము వేదములే. వేదపఠనము వలన మీరు ప్రభువును స్తుతించినట్లే. దానికి ప్రతిఫలముగా, దేవతలమైన మేము కూడా మిమ్ములను ఎంతగానో స్తుతించుచున్నాము. లేనియెడల నా నుండి మీరు స్తుతింపబడుట సాధ్యమా? ఎవరికైన భోజనము కావలెనన్న వారు యితరులకు భోజనము పెట్టి ఉండవలెను. ఎవరైన ఒక గింజను దానము చేసిన యెడల దేవతలమైన మేము దానిని వెయ్యిగింజలుగా చేసి ప్రతిఫలముగా వారికి ఇవ్వగలవారము. అసలు మీరు దానమే చేయనపుడు మేమేమి చేయగలము? మీరు వేదోచ్చారణ చేసినందువలన అనంతఫలము మీకు కలిగినది. కావున మీరు ఇంద్రలోకమున్నంతవరకును, స్వేచ్చగా యిందుండవచ్చును. తదుపరి మరొక లోకమునకు పోవచ్చును. ఈ రకముగా మీరు అనంత కాలము స్వేచ్చగా ఉండవచ్చును."

ఇంద్రుని వచనములు విన్న వారు సంకట స్థితికి లోనయిరి. ఆకలిదప్పికలతో నిరాహారముగా అనంతకాలము జీవించి యుండుట దుర్భరమైన శిక్షయేనని వారికి తోచినది. ఇంద్రుడు మరల యిట్లు పలికెను. "మీరు పవిత్రమైన పాదగయా క్షేత్రము నందు నివసించియు పితృ దేవతలకు పిండోదకములు యిచ్చునపుడును, అబ్దీకములు పెట్టునపుడును శ్రద్ధారహితముగా చేసిరి. మీరు ఎల్లప్పుడూ శ్రాద్ధకర్మలకు ఎంత ధనము ఖర్చయినదీ, ఎంతటి రుచికరములైన ఆహార పదార్థములను భుజించుచుంటిమి అను ధ్యాసలోనే ఉంటిరే గాని శ్రాద్ధకర్మలను చేయునప్పుడు కావలసిన శ్రద్ధాభక్తులతో లేరు. దానితో పితృదేవతలకు ఉత్తమగతులు ప్రాప్తించలేదు. మీ వారసులు కూడా యిదేవిధముగా చేయుచుండిరి. మా తల్లిదండ్రులు దీర్ఘ కాలము జీవించిరి. ఆహా! ఎంత ఆహారము వృధాగా ఖర్చయినది? వారి వైద్య సదుపాయములకు ఎంత ధనము దుర్వ్యయమైనది అని చింతించు సంతానమును కలిగి యుండిరి. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మీ మధ్యనే అవతరించి తరుణోపాయమును చూపుచుండగా మీరు వారిని దుర్భాషలాడిరి. వ్యర్థ తర్కవితర్కములను చేసిరి. భగవానునికి చెప్పబడిన అన్ని శుభలక్షణములు, సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము వంటి అవతార లక్షణములన్నియూ స్పష్టముగా వారిలో కన్పించుచున్ననూ, శ్రీపాద శ్రీవల్లభులను దత్తావతారముగా గుర్తించలేని అంధులయితిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి పవిత్ర నామోచ్చారణ చేత పవిత్రమైన శరీరము గల వ్యక్తియొక్క రక్తమును పానము చేసిన తదుపరి మీకు ఉత్తమగతులు కలుగునట్లును అంతవరకు పితృదేవతారూపమైన వాయసరూపములోనే ఉండునట్లును నిర్ణయింపబడినది." "శంకరభట్టూ! ఆ కారణము చేతనే వారు కాకులుగా జన్మించి, పూర్వ పుణ్య వశమున నీ శరీరమందలి రుధిరమును పానము చేసి సద్గతిని పొందిరి." అని శ్రీ వల్లభదాసు పలికెను.

అంతట నా ఎదురుగా ఉన్న వల్లభదాసు సామాన్య వ్యక్తి కాదనియూ, శ్రీపాదవల్లభుల కరుణ వారిపై సంపూర్ణముగా కలదనియు నేను గుర్తించితిని. శ్రీవల్లభదాసు యిట్లు పలికెను. "అయ్యా! మీ శరీరము నుండి వచ్చు వాసనచేత ఆకర్షింపబడిన సర్పములు మిమ్ము కాటు వేసిన తదుపరి సద్గతిని పొందినవి."

నేను "అయ్యా! వల్లభదాసు మహాశయా! ఆ సంఘటన ఎందులకు జరుగవలసి వచ్చినది? ఈ రకముగా నా శరీరము కాకులకును, సర్పములకును, ఇతరమైన జీవజంతువులకును ఆహారముగా వినియోగపడినట్లయిన నాకు చాలా సంకటముగా ఉండును. ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడిచేయునోయని చాలా భయముగా ఉన్నది?" అని అంటిని.

అందుకు శ్రీవల్లభదాసు, "అయ్యా! ఇదంతయునూ శ్రీవల్లభుల వారి వినోదభరితమైన లీల. నీవు అటువంటి భయమును చెందవలదు. ఇక మీదట యిటువంటి ఉపద్రవములు జరగవు.

ప్రాణములు యిచ్చిన వానికే, ప్రాణములను తీయు అధికారము కూడా ఉండును గనుక అటువంటి అధికారము భగవంతునికి తప్ప మరెవ్వరికీ యుండదు.

శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 5

కానీ మీ పితృదేవతలలోని కొందరు స్మశాన కాళికాసాధన చేసి, దానితో అయిష్టులయిన వారిని ఎందరినో, తమ మంత్ర ప్రభావముతో చంపియుండిరి. ఆ విధముగా కొందరి యొక్క అసహజ మరణమునకు కారణభూతులగుట వలన వారికి మహాపాపము కలిగినది. ఆ పాపవశమున వారు సర్పజన్మనెత్తినారు. అయితే శ్రీపాదుల వారి కరుణను పొందిన నీవు వారి వంశములోనే జన్మించుట వలన, నీ రుధిరము వారికి కూడా కొంత సంబంధితమై ఉండును. ఆ స్వల్ప పుణ్యముల వలన యీ సంఘటన జరిగి వారికి ఉత్తమగతులు లభించినవి.

అయ్యా! బ్రాహ్మణుడు సత్యాన్వేషిగా ఉండవలెను. క్షత్రియుడు ధర్మమునకు బద్ధుడై ఉండవలెను. వైశ్యుడు వ్యవసాయంబును, గోవులను రక్షించుట, క్రయ విక్రయాది కుశల వ్యవహారములను సలుపవలెను. కావున శాంతిస్వరూపుడై ఉండవలెను. శూద్రుడు ప్రేమస్వరూపుడై, సేవలను సలుపవలెను. అయితే భగవదనుగ్రహప్రాప్తికి జాతి, కుల, ధనిక, పేద అనెడి భేదమేమియును ఉండదు. బ్రాహ్మణుడు క్షత్రియధర్మమును పాటించి రాజు కావచ్చును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానము నపేక్షించినపుడు బ్రాహ్మణ ధర్మమూ ననుసరించవచ్చును. వైశ్యుడైన కుసుమశ్రేష్టి క్షత్రియ ధర్మమును పాటించి రాజరికము చేయలేదా? శత్రువును చంపుట అనునది బ్రాహ్మణధర్మ ప్రకారము దోషమైనది. కాని క్షత్రియధర్మము ప్రకారము విహితమైనది. నీవు బ్రాహ్మణుడవు. సత్యాన్వేషివి. కావున అహింస నీకు పరమధర్మము. కాని కసాయివానికి మాత్రము కాదు.


కావున మానవుడు చేయు కర్మలవలన ఫలితము సక్రమముగా ఉండవలెనన్న, తానూ ఏ కులమందు జన్మించినను, తాను అనుసరించు ధర్మమునకు తగినట్లుగా కర్మలను సలుపుచుండవలెను. నీవు ప్రస్తుతము రోగగ్రస్తుడవు గనుక వైద్యుని వద్ద ఉండుట శ్రేయస్కరము, విహితము. అందువలననే నీవు నా వద్దకు రప్పించబడితివి.

శ్రీపాద శ్రీవల్లభులు మనలను ప్రతీ క్షణము గమనిస్తూనే ఉంటారని తెలుసుకోవలసినది. నీవు చిన్నప్పుడు విష్ణుమూర్తి ధ్యానశ్లోకమును పఠిoచుచూ వినోదముగా నీ తోటివారితో వదురుచుండెడివాడవు. "శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే" అను శ్లోకమును వినోదము కొరకు తప్పుడు అర్థమును చెప్పెడివాడవు. శుక్లాం బరధరం అనగా తెల్లబట్టలను ధరించునది అనియు, విష్ణుం అనగా అంతటా ఉండునది అనియు శశివర్ణం అనగా బూడిదరంగులో కూడినదనియూ చతుర్భుజం అనగా నాలుగు కాళ్ళు కలిగినదనియూ, ప్రసన్నవదనం అనగా ఓండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైన ముఖము కలిగినదనియూ, సర్వ విఘ్నములు శాంతించుటకు అటువంటి గాడిదను ధ్యానించుచున్నాను, అని చెప్పెడివాడవు. అయ్యా! శంకరభట్టూ! శ్రీదత్తప్రభువు బహుచమత్కారి. నీవు వినోదము కొరకు చేసిన తప్పుడు పనులను కూడా ప్రభువు తన సన్నిధానములో సరిదిద్దును. రజకులు నిన్ను తమ గాడిద మీద నా వద్దకు తీసుకొని వచ్చిరి. అపుడు నీవు దుమ్ము, ధూళితో బూడిదరంగులోనే ఉంటివి. నడువలేక నడువలేక ఒక్కొక్క పర్యాయము రెండు చేతులను నేలకు ఆన్చి నడచివచ్చితివి. ఆ విధముగ నీవు సర్పముల బారి పడకుండా ఉండగలనని భావించి చతుర్భుజుడవై ఆయాస పడుచూ మేడిచెట్టు వద్దకు వచ్చిననూ గండమును తప్పించుకొనలేకపోతివి. బాధతో విలవిల్లాడకపోయిన యెడల నీవు ప్రసన్నవదనుడవే. ఆఖరికి నీవు చర్మకారుల పల్లెకు చేర్చబడితివి. నిన్ను యీ రకమయిన దురవస్థల పాలు చేయుటలో శ్రీవల్లభుల వినోదముతో పాటు నీకు గుణపాఠమును నేర్పి నీచ జన్మల నుండి వారికి విముక్తి కలిగించబడినది. నీవు వినోదముగా తోటి బాలురకు విష్ణు ధ్యాన శ్లోకమును చెప్పుచుండెడివాడవు. అందులకే ఆఖరికి అంత్యజుడనైన నా చేత ఉపదేశమును వినెడి పరిస్థితికి వచ్చితివి. ఇప్పుడు నీవు యిచ్చటనున్నావు. రేపు నీవు నీ సాటి కులస్థుల యింట ఉండవచ్చును. ఇప్పుడు జరిగిన యీ సంఘటనను వారికి పొరపాటున చెప్పిననూ వారు నిన్ను తమ కులముల నుండి వెలి వేయుదురు.

శ్రీ వల్లభదాసుని హితబోధతో నాలోని బ్రాహ్మణ అహంకారం తగ్గినది. వల్లభదాసు అంత్యజుడన్న భావము పోయి అతడు కూడా నా రక్త సంబంధీకుడే అన్నంత సోదర ప్రేమ వానిపై నాకు కలిగినది. వల్లభదాసు ఆతిధ్యమును స్వీకరించి రెండు, మూడు రోజులు గడచిన తరువాత నేను ఆ ఊరి నుండి బయలుదేరితిని.

శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 6

శ్రీవల్లభుల అనుగ్రహ విశేషమును ఏమని వర్ణించగలను ? నేను చిదంబరం చేరుటకు ముందు విచిత్రపురం అను పట్టణములో విచిత్రపరిస్థితుల్లో యిరుక్కొని విచిత్రముగ బయటపడితిని.

నేను విచిత్రపురం అను గ్రామము నుండి కాలినడకన పోవుచుండగా వినయవిధేయతలతో కూడిన రాజభటులు నన్ను సమీపించి, అయ్యా! మీరు వైష్ణవులా! శైవులా! అని ప్రశ్నించిరి. "మేము శివకేశవ భేదమును పాటించని స్మార్తులమనియు, అయినను కాస్త శైవము వైపు మొగ్గు చూపెడివారమనియు, ఆది శంకరుల దక్షినామ్నాయి పీఠం అయిన శృంగేరి యందలి శంకరాచార్యుల వారు మాకు గురువులగుదురనియూ" నేను చెప్పితిని. మీరు దయ ఉంచి మా రాజు గారి వద్దకు రావలసినదని వారు కోరిరి. నేను వారిననుసరించి రాజ దర్శనమునకు పోయితిని. దారి మధ్యలో సంభాషణ వశమున నాకు కొన్ని విచిత్ర విషయములు తెలిసినవి. ఆ రోజు బ్రాహ్మణులెవరయినా కనిపించిన యెడల, వారిని తన వద్దకు రమ్మని ఆహ్వానించి, "అంతకు యింత అయితే యింతకు ఎంత?" అని ప్రశ్నను అడుగుచుండిరి. దానికి సంతృప్తికరముగా ఎవరునూ సమాధానము చెప్పువారు లేకపోయిరి. ఆ రాజునకు పుత్ర సంతానము కలుగవలెనని కొన్ని సంవత్సరములకు పూర్వము యజ్ఞము చేయించిరి. అదృష్ట వశమున వానికి పుత్రసంతానము కలిగినది. అయితే ఆనాటి నుండి బ్రాహ్మణులకు విచిత్రమైన కష్టములు ఎదురైనవి. దురదృష్టవశమున రాజునకు జన్మించిన కుమారుడు మూగవాడయ్యెను, బ్రాహ్మణులు లోపభూయిష్టమైన యజ్ఞమును చేయుటవలననే తన కుమారుడు మూగవాడయ్యెనని రాజు అభిప్రాయపడెను.అందుచే ఆ రాజు శైవులయిన బ్రాహ్మణులను నున్నగా గుండు గొరిగించి వైష్ణవ నామములను ముఖమున పెట్టించి గాడిదపై ఊరేగించెను. వైష్ణవులయిన బ్రాహ్మణులను నున్నగా గుండు గొరిగించి విభూతి రేఖలు పెట్టించి గాడిదపై ఊరేగించెను. ఈ పరిస్థితి శైవులకును, వైష్ణవులకును కూడా సంకట ప్రాయమయ్యెను. రాజు ఉన్నట్లుండి వింతగా ప్రవర్తింపసాగెను. బ్రాహ్మణులను పిలిచి తోటకూర దానము చేయసాగెను. సాగుభూమిలో అధిక విస్తీర్ణములో తోటకూర పండించునట్లు ఆజ్ఞాపించెను. సుంకములో భాగము తోటకూర రూపములో వసూలు చేయబడుచుండెను. బండ్ల కొలది తోటకూర కోటలో జమ చేయబడుచుండెను. బ్రాహ్మణులకు తినలేనంత తోటకూర దానము చేయబడుచుండెను. అన్నము వండుకొని తినుటయు, తక్కిన వంటకములను భుజించుటయూ బ్రాహ్మణులకు నిషేధింపబడెను. తోటకూరను వండుకొని తినిన తర్వాతా వారికి ఎప్పుడు అల్పాహారము కావలసినను పచ్చి తోటకూరనో, వండిన తోటకూరనో తినవలసి వచ్చెడిది.

బ్రాహ్మణులు మాత్రము ఏమి చేయగలరు? తర్కములో పండితులమనియూ, వేదాంతములో పండితులమనియూ, పురాణేతిహాసములలో పండితులమనియు విర్రవీగెడి బ్రాహ్మణులు అందరునూ కూడ తమ అహంకారమును విడిచి మౌనముగా తమ దురవస్థను బాపుమని దైవమును దీనముగా ప్రార్థించుచుండిరి. బ్రాహ్మణులందరిలోను ఒక దత్త భక్తుడు, దత్తోపాసకుడు ఉండెను. శ్రీ దత్తాత్రేయుడు స్మరణ మాత్రమున ప్రసన్నుడగుననియు, తమ దురవస్థను శ్రీ ప్రభువే బాపగలడనియు అతడు చెప్పెను. అందుచేత బ్రాహ్మణులందరునూ మండల దీక్షను పూని శ్రీ దత్తాత్రేయుల వారిని ఆరాధించిరి.

తన కుమారుడు మూగవాడగుట వలన మూగ భాషను ప్రోత్సహించవలెనని ఆ రాజు తలచెను. తన రాజగురువును చూచి మూగ భాషపై గ్రంథమును వ్రాయమని ఆదేశించెను. ఆ రాజగురువు గతములో చాల గర్విష్టిగా నుండెను. ప్రస్తుతము అతడు దయనీయమైన పరిస్థితిలో నుండి, మూగభాషపై విస్తృత పరిశోధనలు చేయసాగెను.

శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము

శంకరభట్టు మహారాజుల సంవాదము 

నన్ను రాజసముఖమున నిలబెట్టిరి. నాకు ముచ్చెమటలు పోయుచుండెను. శ్రీపాద శ్రీవల్లభులు నన్ను ఎంతటి పరీక్ష చేయుచుంటిరి? అని తలంచితిని. శ్రీపాదుల నామమును మనస్సులో అవిశ్రాంతముగా జపించుకొనుచుంటిని. నాలో గతములో ఎన్నడూ లేని ధైర్యము కలుగసాగెను. రాజు అందరినీ ప్రశ్నించునటులే నన్ను కూడా "అంతకు యింత అయిన యింతకు ఎంత అగును?" అని ప్రశ్నించెను. "ఇంతకు ఇంతే!" అని గంభీరముగా బదులిచ్చితిని. రాజు విభ్రాంతుడై యీ విధముగా వచించెను. "మహాత్మా! మీరు చాలా గొప్పవారు. మీ దర్శన భాగ్యము వలన నేను ధన్యుడనయితిని. నాకు ఈ మధ్యనే పూర్వ జన్మ జ్ఞానము మేల్కొనినది. నేను గత జన్మలో బహు బీదవాడినైన బ్రాహ్మణుడను. నా యింటిలో తోటకూరను పెంచుచుంటిని. అడిగిన వారికి లేదనకుండా తోటకూరను దానము చేసెడివాడను. నా నుండి తోటకూర దానము పొందిన బ్రాహ్మణులు నా కంటె కూడ ధనికులు, అన్నపానములకు లోటులేనివారు. వారు నా నుండి దానమును పొందుటయే గాని, ఏనాడూ నాకు సహకరించలేదు, నాపై దయ చూపలేదు. అబ్దీకములకు గాని, వివాహములకు గాని వారి తరపున నన్ను పంపినప్పుడు విశేషముగా దక్షిణలు, సంభావనలు వచ్చెడివి. అందుండి వంద వంతులలో ఒక వంతు మాత్రమే నాకిచ్చి తొంబై తొమ్మిదివంతులు వారే స్వీకరించెడివారు. శ్రమ నాది, ఫలితం వారిది అన్నట్లుగా ఉండెడిది. పైగా నా యింటి నుండి తోటకూరను ఉచితముగా పొందెడివారు. నేను కటిక దరిద్రమునే అనుభవిస్తూ తోటకూరను మాత్రం యధావిధిగా దానము చేస్తూనే ఉండేవాడను. ఆ బ్రాహ్మణులు తోటకూర ఎంతో రుచిగా ఉన్నదనియు ప్రతిరోజూ తినుట వలన హాని ఏమియూ జరుగదనియూ చెప్పుచుండిరి.

కాలచక్రము గిర్రున తిరిగినది. పూర్వ జన్మలో నేను కటిక దరిద్రస్థితిలో ఉండికూడా తోటకూర దానము చేయుట వలన ఈ జన్మలో రాజుగా జన్మించితిని. పూర్వజన్మలో నా వద్ద తోటకూర దానము పొందిన ఆ బ్రాహ్మణులు ఈ జన్మలో నా రాజ్యములోనే బ్రాహ్మణులుగా జన్మించిరి. ఆ విధముగ నేను వారి కంటె ఎన్నో రెట్లు ధనవంతుడుగను, శ్రేష్టుడిగను జన్మించితిని. తోటకూర దానము చేయుట వలన రాజయితిని గదా, మరి యిప్పుడు అప్పటికంటె ఎన్నో రెట్లు బండ్లకొలది తోటకూర దానము చేయుచున్నాను. ఈ దానమునకు ప్రతిఫలముగా నేను పొందబోవు మహోన్నత స్థితి ఏమిటి? అని యీ వింత ప్రశ్నను వేసితిని. దానికి మీరు సరియైన సమాధానం చెప్పితిరి." అని ముగించెను. అంతట నేను "రాజా! పూర్వజన్మలో పరిస్థితుల దృష్ట్యా మీ వద్దనున్న తోటకూర ఎంతో విలువైనది. అయితే ప్రస్తుతము మీరున్న అత్యున్నత స్థితి దృష్ట్యా ఆ తోటకూర అత్యల్పమయినది. మణులు, రత్నములు, బంగారము వంటివి దానము ఈయదగిన యీ స్థితిలో మీరు తోటకూర ఎంత దానము చేసినాను అందుకు వందరెట్లు తోటకూర మీకు లభించును గాని అంతకంటే మరేమియూ రాదు." అని అంటిని. నా మాటలకు రాజు ఎంతో సంతోషించెను. నేను యథాలాపముగా యిచ్చిన జవాబునకు రాజు తన స్వీయ పూర్వజన్మ కారణము తెలుపుట నా మనస్సునకు ఊరట కలిగించినది. శ్రీ చరనులు కృపా విశేషమున గాడిదను అధిరోహించెడి గండము తప్పినదని భావించితిని. "శుక్లాంబర ధరం విష్ణుం..." అను పవిత్ర శ్లోకమునకు తప్పుడు అర్థము వినోదము కోసము చిన్నప్పుడు చెప్పిన దానికి యిదివరకే గాడిదను అధిరోహించుట జరిగినది. ఇప్పుడు చాలా అవమానకర పరిస్థితిలో గాడిదనెక్కెడి గండము తప్పించినందులకు శ్రీపాదులవారికి నా మనస్సులోనే నమస్సులు అర్పించితిని

శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 8

శంకరభట్టు మహారాజుల సంవాదము

ఇంక రెండవ పరీక్ష ప్రారంభమాయెను. రాజునకు అత్యంత ప్రియమయిన మూగ భాషలో పరీక్ష మొదలాయెను. రాజగురువులు నన్ను పరీక్షించుట మొదలిడిరి. రాజగురువులు తమ వేళ్ళను చూపుచూ ఒకటా, రెండా? అని సైగలతో ప్రశ్నించిరి. నీవు ఒక్కడివే వచ్చుచున్నావా? లేక మరొకరు ఎవరయినా తోడున్నారా ? అను అర్థముతో రాజగురువులు అడుగుచున్నారని అనుకొని ఒక్కడనే వచ్చితినని ఒక వేలు చూపించుచూ సైగలతో ఉత్తరమిచ్చితిని. తదుపరి వారు మూడువేళ్ళను చూపిరి. మూడు సంఖ్య నాకు దత్తాత్రేయుల వారిని స్ఫురింపజేసినది. మీరు దత్తభక్తులా? అని ప్రశ్నించితిరనుకొంటిని. భక్తి అనునది గుప్తముగా ఉండవలసినదని భావించి పిడికిలిని బిగించి చూపి యిది రహస్యమైన విషయమనియు అది హృదయాంతరంగమునందలి విషయమని తెలియజేసితిని. దానికి రాజగురువులు తియ్యటి తినుబండారములు బ్రతిమాలు ధోరణిలో సైగలతో యివ్వబోయిరి. నేను అది వలదని వారించుచూ నా వద్దనున్న అతుకుల మూటను చూపి అందుండి కొన్ని అటుకులను దీసి వారికిచ్చితిని. నాకు తియ్యటి తినుబండారముల కంటె అతుకుల యందు యిష్టము ఎక్కువనియు, మీరు కూడా వీటి రుచిని తెలుసుకోవచ్చుననియూ నా భావము.

అప్పుడు రాజగురువులు ఉదాత్తస్వరముతో "రాజా! ఇతడు గొప్ప పండితుడు. వేద వేదాంగములను ఔపోశన పట్టిన మహా పండితుడని తెలియుచున్నది. ఈతడు మూగభాషలో కూడా మహా పండితుడని శ్లాఘించెను." నాకంతయునూ అయోమయముగ నున్నది. అపుడు రాజగురువు రాజునకు ఇట్లు తెలియపరచెను. "రాజా! శివకేశవులవారు యిద్దరున్నారు కదా! వారిద్దరూ ఒకటేనా? వేరు వేరా ? అని ప్రశ్నించితిని. ఒక వేలు చూపుచూ ఇతడు వారిద్దరూ ఒకటేయని తెలియజేసెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని ముగ్గురున్నారు కదా! అని మూడు వేళ్ళను చూపితిని. అందులకు ఇతడు తన ముష్టి బిగించి ఒకే చేతికి అయిదు వేళ్ళు ఉన్ననూ సమిష్టిగా లేవా? అని ఎదురు ప్రశ్నించెను. నన్ను తమ శిష్యునిగా స్వీకరించవలసినదని మధురపదార్థములను యివ్వబోతిని. తనకు అటువంటి శిష్యప్రశిష్యుల గోల ఏమి లేదనియూ కుచేలుని వలె తను సంతుష్టితో జీవించే వ్యక్తిననియూ, తెలియజేయుచూ నా అభ్యర్థనను కాదని తన వద్దనున్న అటుకులను నాకిచ్చెను." నేను దిగ్భ్రాంతుడనయితిని. ఆహా! లోకములోని మనస్సులు. వాటి ఆలోచనలు, అర్థము చేసుకొను పద్ధతులు ఎంత విభిన్నమయినవని ఆశ్చర్యపోయితిని.


ఇంక మూడవ పరీక్ష ఆఖరి పరీక్ష. రాజగురువు చమకములోని పనసలను చదువుచూ వాటి అర్థమును వివరించమనెను. శ్రీవల్లభులను తలచుకొని నాకు తోచిన రీతిగా ఇట్లు వ్యాఖ్యానించితిని. "ఏకాచమే అనగా ఒకటి. త్రిస్రశ్చమే అనగా ఒకటికి మూడు కలిపి, వర్గమూలము కనుగొనగా రెండు. పంచచమే అనగా నాలుగుకు అయిదు కలుపగా తొమ్మిది వచ్చును. దాని వర్గమూలము మూడు అగును. సప్తచమే అనగా ఇందాక వచ్చిన తొమ్మిదికి ఏడు కలుపగా పదహారు వచ్చును. దాని వర్గమూలము నాలుగు. నవచమే అనగా ఇందాక వచ్చిన పదహారుకు తొమ్మిది కలుపగా ఇరవై అయిదు వచ్చును. దాని వర్గమూలము అయిదు. ఏకాదశచమే అనగా ఇందాక వచ్చిన ఇరవై అయిదునకు పదకొండు కలుపగా వచ్చిన ముప్పైఆరునకు వర్గమూలము ఆరు. త్రయోదశచమే అనగా ముప్పైఆరునకు పదమూడు కలిపి వర్గమూలము కనుగొన్న ఏడు వచ్చును. పంచదశచమే అనగా నలభై తొమ్మిదికి పదిహేను కలిపిన 64 వచ్చును. దానికి వర్గమూలము 8 . సప్తదశచమే అనగా 64 నకు 17 కలిపిన 81 వచ్చును. దాని వర్గమూలము 9 . నవదశచమే అనగా 81 కి 19 కలుపగా 100 వచ్చును. దాని వర్గమూలము 10. ఏకవింగ్ శతిశ్చమే అనగా 100 కు 21 కలుపగా 121 వచ్చును. దానికి వర్గమూలము 11 . త్రయోవింగ్ శతిశ్చమే అనగా 121 కి 23 కలుపగా 144 వచ్చును. దాని వర్గమూలము 12 . పంచవింగ్ శతిశ్చమే అనగా 144 కి 25 కలుపగా 169 వచ్చును. దాని వర్గమూలము 13 . సప్తవింగ్ శతిశ్చమే అనగా 169 కి 27 కలుపగా 196 వచ్చును. దాని వర్గమూలము 14 . నవవింగ్ శతిశ్చమే అనగా 196 కి 29 కలుపగా 225 వచ్చును. దాని వర్గమూలము 15.   ఏకత్రిఇంశతిశ్చతు అనగా 225 కి 31 కలుపగా 256 వచ్చును. దాని వర్గమూలం 16 . త్రయోవింగ్ శతిశ్చమే అనగా 256 కి 33 కలుపగా 289 వచ్చును. దాని వర్గమూలం 17 . పంచవింగ్ శతిశ్చమే అనగా 289 కి 35 కలుపగా 324 వచ్చును. దాని వర్గమూలము 18 . సప్తత్రింగ్ శతిశ్చమే అనగా 324 కి 37 కలుపగా 361 వచ్చును. దాని వర్గమూలము 19 . నవత్రింగ్ శతిశ్చమే అనగా 361 కి 39 కలుపగా 400 వచ్చును. దాని వర్గమూలము 20 ." అయితే నా వ్యాఖ్యానము సభలోని పండితులను ఎంతగానో అలరించినది. నా వ్యాఖ్యానము నాకే ఆశ్చర్యముగా తోచినది. మరల నేనిట్లు వచించితిని. "ఇదియంతయు పరమాణువుల యొక్క రహస్యము. ఇది కాణాదమహర్షికి తెలియును. పరమాణువుల సూక్ష్మ కణముల సంఖ్యాభేదమును బట్టి వివిధ ధాతువులు ఏర్పడును." శ్రీపాద శ్రీవల్లభుల కృపా విశేషము వలన పై విధముగా నేను విచిత్రపురం నుండి విచిత్రముగా బయటపడితిని.

                                        శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

Related Posts

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము-2 | sripada.co
4/ 5
Oleh

Subscribe via email

Like the post above? Please subscribe to the latest posts directly via email.

Powered by Blogger.