sripada srivallabha charitamrutam chapter - 3 | శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము-3 | sripada.co

   శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం  అధ్యాయము-3 


             శంకరభట్టునకు పళనిస్వామి దర్శనం, కురువపుర సందర్శనం


శ్రీపాద శ్రీవల్లభ స్మరణ మహిమ 


శ్రీపాద శ్రీవల్లభుల దయవలన నేను విచిత్రపురం నుండి బయలుదేరితిని. నా మనస్సు చిదంబరము నందలి పరమేశ్వరుని దర్శించుటకు ఉవ్విళ్లూరుచుండెను. మూడురోజులు ప్రయాణము ఆనందకరముగా జరిగెను. నాకు అయాచితముగా భోజనము లభించుచుండెను. నాలుగవ దినమున ఒక గ్రామమునందు ఒక బ్రాహ్మణ గృహద్వారమున నిలబడి భిక్ష యాచించితిని. లోపలి నుండి మహా రౌద్రాకారముతో గృహ యజమాని భార్య వచ్చి అన్నమూ లేదు, సున్నమూ లేదు, అని కసురుకొనెను. నేను గృహము బైటనే కొంతసేపు వేచి యుంటిని. గృహ యజమాని బయటకు వచ్చి, "అయ్యా! అతిథి అభ్యాగతి సేవలకు నేను నోచుకొనలేదు. నా భార్య పరమగయ్యాళి. ఆమెకు కోపము వచ్చిన యెడల నా నెత్తి మీద కుండలను పగులగొట్టును. ఈ విషయమున మాత్రము మా గురుదేవుల ధర్మపత్నియు, యీమెయు సమానము. అయితే నా భార్య మాత్రము తను పగులగొట్టిన కుండల యొక్క మూల్యమును తెమ్మని నన్ను బాధించును.మా గురుదేవుల ధర్మపత్ని మాత్రము భాండమూల్యమును తెమ్మని బాధింపదు. ఇప్పుడే నా నెత్తిమీద కుండలు పగులగొట్టబడినవి. మా యింట అన్నోదకములకు లోటు లేదు. నేను భాండమూల్యమును మాత్రము విధిగా సత్వరమే చెల్లింపవలెను. అది నాకు సంకటముగా ఉన్నది. ఈ రోజున సంభావన దొరకు అవకాశమున్న యెడల ఇబ్బంది ఉండదు. లేని యెడల ఎవరి దగ్గరో అప్పో సొప్పో చేయవలెను. తిరిగి సంభావనలు దొరికినప్పుడు ఆ అప్పు తీర్చవలెను. నేను సంభావనలో దొరికిన ద్రవ్యములో కొంత భాగమును అప్పులు తీర్చుటకు వినియోగించి, మిగిలిన భాగమును ఆమెకు ఇచ్చుచుందును.

 ఈ పధ్ధతి కొంతకాలము వరకు సాగెను. ఈ మధ్యన సంభావనలో దొరకు యావత్తు ద్రవ్యమును ఆమెయే తీసుకోనుచుండెను. అందువలన అప్పు తీర్చుటకు దారి కనబడుటలేదు. నా పరిస్థితి తెలిసినవారు ఎవ్వరునూ అప్పు ఇచ్చుటకు ముందుకు వచ్చుట లేదు. లోకులు 'నీకు అప్పు యిచ్చిన యెడల ఏ విధముగా తీర్చెదవు? మున్ముందు సంభావనలు వచ్చునపుడు తీర్చెదమనుకొందువా? ఆ దారియును యిప్పుడు మూసుకొని పోయెను.' అని అనుచుండిరి. స్థితిపరుడనయిన నాకు ఎవ్వరునూ దానము కూడా చేయుటలేదు. పైగా ఎగతాళి చేయుచుండిరి. ఇప్పుడు నేను భాండమూల్యమును చెల్లింపవలెను. నా భార్య నిన్ను కసురుకొనిన పిదప నన్ను లోనికి పిలచి, 'వీధిలో ఒక తీర్థయాత్రికుడు ఉన్నాడు. నీవు అతనితో పోయి ఎచ్చటయినా ఎవరయినా దానమిచ్చిన యెడల తీసుకురావలసినది. అప్పుడు మాత్రమే యింటిలో నీకు అన్నము లభించును.' అని అన్నది. అంతట భార్యా విధేయుడనై నేను నీతో బయలుదేరి వచ్చెదను. ఈ గ్రామములోని బ్రాహ్మణ్యము యొక్క గృహములన్నియును నాకు బాగుగా తెలియును. మనకు భోజనముతో పాటు దక్షిణ రూపమున కూడా ధనము లభించవచ్చును." అని ఆ బ్రాహ్మణుడు పలికెను. నేను నివ్వెరపోతిని. శ్రీపాదా! శ్రీవల్లభా! ఏమి యీ విషమ పరీక్ష! అనుకోని ఆ బ్రాహ్మణునితో కలిసి ఆ అగ్రహారములోని ప్రతి గృహస్థు యింటికిని పోయితిని. ధనసహాయము మాట అటుంచి ఒక్కరునూ పట్టెడు అన్నమును పెట్టువారే కరువయిరి. నాతో వచ్చిన బ్రాహ్మణుడు యిట్లు పలికెను. "అయ్యా! ఇప్పటివరకు నేను మాత్రమే దురదృష్టవంతుడను. నాతో కలియుట వలన నీ అదృష్టము కూడా హరించి నీకు కూడా దురదృష్టవంతుడవయితివి." అప్పుడు నేను యిట్లంటిని. "అయ్యా! సమస్త జీవులకును ఆహారమును సమకూర్చువాడు సర్వసమర్థుడైన శ్రీదత్త ప్రభువే! వారు ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో కురువపురమున ఉన్నారు. నేను వారి దర్శనార్థమే పోవుచుంటిని. వారి నామస్మరణ చేసుకొనుచూ ఆ కనిపించుచున్న రావిచెట్టు మొదటలో కూర్చొనెదము. ఆపైన శ్రీదత్త ప్రభుని అనుగ్రహము". అని పలికితిని.

దానికి ఆ బ్రాహ్మణుడు వల్లెయనెను. కడుపులో ఆకలి దహించుచున్నది. నీరసముతో కూడిన స్వరముతో శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణము చేయుచుంటిని. నామస్మరణ కొనసాగుచుండగా విచిత్రపుర రాజభటులు మా వద్దకు వచ్చి, "అయ్యా! యువరాజుల వారికి మాట వచ్చినది. మూగతనము పోయినది. సత్వరమే మిమ్ములను తీసుకొని రమ్మని రాజాజ్ఞ అయినది. అందుచేత మీరు వెంటనే మాతో రావలసినదని" విన్నవించిరి. మా దురవస్థను రాజభటులకు చెప్పక నేనిట్లంటిని. "నేను ఒంటరిగా రాజాలను. నాతోపాటు యీ బ్రాహ్మణుని కూడా తీసుకుని వెళ్లవలెనని చెప్పితిని." దానికి రాజభటులు వల్లెయనిరి. మమ్ములను గుఱ్ఱములపై కూర్చుండబెట్టుకొని సగౌరవముగా తీసుకొని పోవుటను అగ్రహారీకులందరు గమనించి ముక్కుమీద వ్రేలు వేసికొనిరి.

మహారాజు ఇట్లు పలికెను. "అయ్యా! మహాత్మా! మీరు మహాపండితులని తెలిసి కూడా మిమ్ము సత్కరించకుండగా వట్టి చేతులతో పంపించితిమి. మీరు వెళ్ళిన తదుపరి యువరాజు స్పృహ తప్పి పడిపోయెను. అనేక ఉపచారములను చేసితిమి. చాలా సేపటికి కనులు తెరచి శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా! శ్రీదత్త దేవా దిగంబరా! అని పలుకసాగెను. యువరాజునకు ఆజానుబాహుడు, అత్యంత సుందరాకారుడయిన 16 సంవత్సరముల యతి దర్శనమిచ్చి, నోటిలో విభూతిని వేసెనని యువరాజుల వారు చెప్పిరి. ఆ యతి ఎవరు? ఎచ్చటనుందురు? శ్రీదత్తప్రభువులకును, ఆ యోగికిని గల సంబంధమేమి?" దయ ఉంచి తెలుపవలసినదని కోరెను.

"శ్రీపాదుల శ్రీపాదుకా మహిమను నేనేమి వర్ణించగలను? వారు సాక్షాత్తు దత్త ప్రభువుల అవతారము. శ్రీకృష్ణావతారము వలె అత్యంత విశిష్టమైన అవతార స్వరూపము వారిది. వారిని గూర్చి నేను విన్నది కూడా స్వల్పము మాత్రమే! వారిని దర్శించుకొను నిమిత్తమే నేను కురువపురమునకు పోవుచుంటిని. మధ్యలో గల పుణ్యస్థలములను, పుణ్యపురుషులను దర్శించుకొనుచుంటిని." అని సవినయముగా పలికితిని.

విచిత్రపురము నందలి పండితులు కూడా ఈ విచిత్ర సంఘటనకు ఆశ్చర్యపోయిరి. తమ మండల దీక్ష ఫలితముగా, రాజునకు సద్బుద్ధి ఏర్పడి, తమకు విమోచనము కలుగుటయే గాక యువరాజునకు మూగతనము పోయినందులకు వారు వేనోళ్ళ శ్రీవల్లభస్వామిని కీర్తించిరి.

రాజు నన్ను స్వర్ణదానముతో సత్కరించెను. రాజగురువు ఇట్లనెను. "అయ్యా! యిన్ని రోజులకు మాకు జ్ఞానోదయమైనది. శైవులు విష్ణుదూషణ చేయుట వలననూ, వైష్ణవులు శివదూషణ చేయుట వలననూ పాపము మూటగట్టుకొనుట తప్ప మరేమీ ప్రయోజనము లేదని గ్రహించితిమి. మా దైవదూషణలకు ప్రతిఫలముగా కష్టములను అనుభవించితిమి. తెలిసో తెలియకో మా మాధవ నంబూద్రి పుణ్యమా అని దత్తప్రభుని మండల దీక్షలో నుంటిమి. మీకు మేమెంతయునూ ఋణపడి యున్నాము." అని పలికెను.

మేము వారి నుండి శెలవు పుచ్చుకుని వచ్చునపుడు మాధవనంబూద్రి కూడా మాతో పాటు వచ్చెదనని పట్టుబట్టెను. మేము సరేనంటిమి. మేము ముగ్గురమూ అగ్రహారము చేరితిమి. రాజు మాకు దానముగా యిచ్చిన స్వర్ణమును అగ్రహార బ్రాహ్మణ్యమునకు యిచ్చితిని. అతని గయ్యాళి భార్య స్వర్ణమును గ్రహించిన తదుపరి మాకు భోజనము పెట్టెను. తదుపరి ఆమె కూడా శ్రీపాద శ్రీవల్లభుల భక్తురాలిగా మారెను. మునుపటి గయ్యాళితనము పోయి ఆమె సాధువర్తనురాలాయెను.

నేనూ, మాధవ నంబూద్రి కలిసి చిదంబరం వైపునాకు ప్రయాణము సాగించితిమి. ధర్మశాస్త అయ్యప్పదేవుని పూజార్థము గోదావరి మండలాంతర్గతమగు ర్యాలి గ్రామ నివాసులయిన పరబ్రహ్మశాస్త్రిని అగస్త్య మహర్షి తీసుకొని వెళ్ళెను. కాలక్రమమున గర్తపురీ(గుంటూరు) మండలాంతర్గతమైన నంబూరు గ్రామము నందలి వేదపండితులులను, మళయాళదేశము నేలు రాజవంశమువారు ఆహ్వానించగా చాలామంది బ్రాహ్మణులు నంబూరు విడిచి మళయాళదేశము చేరి వేదవిద్యను ప్రకాశింపజేసిరి. వారినే నంబూద్రి బ్రాహ్మణులని వ్యవహరించుట కద్దు. ఆదిశంకరుల వారి పూర్వీకులు కూడా నంబూరు అగ్రహారీకులే! నంబూద్రి బ్రాహ్మణులు ఆచార వ్యవహారములలోను, నియమ నిష్టలలోను, మంత్ర తంత్ర యంత్ర విద్యలలోను చాల ప్రసిద్ధులు. అయితే మాధవనంబూద్రి మాత్రము నిరక్షర కుక్షి. బ్రాహ్మణ గృహముల వంట జేసుకొని జీవించుచుండెను. పసితనముననే తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. అయినవారు ఆదరింపరైరి. దత్తప్రభువునందు అతడు అచంచల భక్తి కలవాడు. శ్రీపాద శ్రీవల్లభుల అవతారమును గురించి విన్న మీదట వారిని ఎప్పుడు దర్శించెదనా యని తహతహలాడుచున్నాడు.

మేము చిదంబరం దాపులలో సిద్ధ మహాత్ములు ఒకరున్నారని విని, కొండకోనలలో ఏకాంతముగా ఉన్న వృద్ధ తపస్వి అయిన శ్రీ పళనిస్వామి వారిని దర్శించితిమి. మేము గుహ ద్వారమునకు వచ్చినప్పటికి శ్రీ పళనిస్వామి మమ్ములను చూచి, "మాధవశంకరులు యిద్దరూ కలిసి వచ్చుచున్నారే ? ఏమి భాగ్యము!" అని పలికెను. మేము మా పరిచయమును తెలుపకుండగనే మమ్ము పేరుతో పిలువగల వీరు సిద్ధ పురుషులని గ్రహించితిమి. కరుణాంతరంగులయిన శ్రీస్వామి "నాయనా! శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞానుసారము నేను దేహమును త్యజించి వేరొక యవ్వనవంతమైన దేహములోనికి ప్రవేశించు సమయము ఆసన్నమైనది. ప్రస్తుత ఈ శరీరము యొక్క వయస్సు 300 సంవత్సరములు. శిథిలమైన ఈ దేహమును త్యజించి నూతన శరీరములో మరొక 300 సంవత్సరములు ఉండవలెనని శ్రీపాదుల వారి ఆజ్ఞ. జీవన్ముక్తులయిన వారు, జనన మరణ రూప సృష్టిక్రమమును దాటిన వారు కూడా శ్రీపాదుల వారు తిరిగి రమ్మని ఆజ్ఞాపించిన వచ్చి తీరవలసినదే ! సమస్త సృష్టిని నడిపించు మహాసంకల్పమే శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. వారి అవతరణము ఉన్నతములయిన సూక్ష్మ లోకములలో ఎల్లప్పుడూ జరుగుచునే యుండును. నరరూపధారియై వచ్చుట సకృత్తు. వారిది యోగ సంపూర్ణ అవతారము. వారి అంశావతారములు ఎల్లపుడునూ యీ భూమి మీద  భక్తి రక్షనర్థము అవతరించుచునే యుండును. నాయనా! శంకరా! నీవు విచిత్ర పురమున కాణాద మహర్షి గురించి వారి కాన సిద్ధాంతమును గురించి వచించితివే, కాస్త వివరింపుము." అని పలికిరి.

కాణాద మహర్షి కణ సిద్ధాంతము
                                                                కాణాద మహర్షి "స్వామీ! నన్ను క్షమింపుడు. కాణాదమహర్షి గురించి, వారి కణసిద్ధాంతము గురించి నాకు తెలిసినది బహు స్వల్పము. నేను వచించినది కూడా అప్రయత్నముగా నా నోట పలికించబడినదని స్వామికి తెలియని విషయము కాదు." అని అంటిని.

కరుణాస్వరూపులైన శ్రీ పలనిస్వామి యిట్లు వచించిరి. సమస్త సృష్టియును కూడా పరమములయిన అణువులచే నిర్మింపబడినది. అటువంటి పరమాణువుల కంటే కూడా సూక్ష్మమైన కణముల ఉనికి వలన విద్యుల్లతలు ఉద్భవించును. సూర్యుని చుట్టూ కేంద్ర బిన్డువుననుసరించి మహా వేగములతో తమ తమ కక్ష్యలలో పరిభ్రమించుచుండును. ఇటువంటి సూక్ష్మ కణముల కంటెను సూక్ష్మమైన స్థితిలో ప్రాణుల యొక్క సమస్త భావోద్వేగాముల స్పందనలు ఉండును. స్పందనశీలమైన యీ జగత్తులో ఏదీ స్థిరముగా ఉండజాలదు. చంచలత్వమే దీని స్వభావము. క్షనక్షము మార్పులు చెందుటయే దీని స్వభావము. ఈ స్పందనల కంటెను కూడా సూక్ష్మ స్థితిలో దత్త ప్రభువుల వారి చైతన్యముండును. వారి అనుగ్రహము పొందుట ఎంత సులభాసధ్యమో అంత కష్ట సాధ్యము కూడా. ప్రతీ కణమును అనంత భాగములుగా విభజిస్తూ పోయిన యెడల ఒక్కొక్క కణ భాగము శూన్య సమానమగుచుండెను. అనంతములైన మహా శూన్యముల సంయోగ ఫలితమే యీ చరాచర సృష్టి, పదార్థము సృష్టి అయినట్లే పూర్తిగా దీనికి భిన్నమైన వ్యతిరేక పదార్థము కూడా ఉందును. ఇవి రెండునూ కలిసినపుడు వ్యతిరేకపదార్థము నశించును. పదార్థము తన గుణగణములను మార్పు చేసుకొనును. అర్చావతారములలో ప్రాణ ప్రతిష్ట జరిగినపుడు ఆ విగ్రహమూర్తులు చైతన్యవంతముగనే యుండి భక్తుల మనోభీష్టములను తీర్చుటకు సమర్థ  వంతమగును. సర్వమంత్రములును కుండలిని యందే కలుగును. దాని యందే గాయత్రీ కూడా కలిగినది. గాయత్రి మంత్రము నందు మూడు పాదములు కలవని అందరూ భావింతురు. అయితే గాయత్రీ మంత్రము నందలి నాలుగవ పాదము 'పరోరజసి సావదోమ్' అని ఉన్నది. చతుష్పాద గాయత్రి నిర్గుణ బ్రహ్మమును సూచించునది అయి ఉన్నది. కుండలినీశక్తి 24 తత్త్వములలో యీ జగత్తులు సృష్టి చేయును. గాయత్రీ యందు కూడా 24 అక్షరములు కలవు. 24 అను సంఖ్యకు గోకులము అని కూడా పేరు కలదు.'గో' అనగా 2. కులము అనగా 4 . బ్రహ్మస్వరూపము మార్పులకు అతీతము కనుక తొమ్మిది సంఖ్యచే సూచితము. ఎనిమిది అనునది మహామాయా స్వరూపము. శ్రీపాద శ్రీవల్లభులు తనకు యిష్టమైన వారి నుండి "దో చౌపాతీ దేవ్ లక్ష్మీ" అని అనుచుండెడివారు. జీవులందరికీ పాటి స్వరూపము పరబ్రహ్మమే కనుక పతిదేవ్ అనునది తొమ్మిది సంఖ్యను, లక్ష్మీ అనునది ఎనిమిది సంఖ్యను, 'దో' అనునది రెండు సంఖ్యను 'చౌ' అనునది నాలుగు సంఖ్యను సూచించునవి అయి ఉన్నవి. 'దో చపాతీ దేవ్ లక్ష్మీ' అనుటకు మారుగా అపభ్రంశముగా, విచిత్రముగా 'దో చౌపాతీ దేవ్ లక్ష్మీ' అని పిలుచుచూ 2498 సంఖ్యను జీవులకు గుర్తుచేయు చుండిరి. గోకులము నందలి పరబ్రహ్మము, పరాశక్తి శ్రీపాద శ్రీవల్లభ రూపముననే ఉన్నవి. శ్రీ కృష్ణ పరమాత్మయే శ్రీవల్లభులని తెలియుము. గాయత్రీ మంత్ర స్వరూపము వారి నిర్గుణ పాదుకలని గుర్తించెదము.


                                                      శ్రీపాద శ్రీవల్లభ నిర్గుణ పాదుకలు


"నాయనా! శంకరా! స్థూల మానవ శరీరము నందు 12 రకముల భేదములు కలవు. అందరికినీ అనుభవైక వేద్యమగు స్థూల శరీరము స్థూల సూర్యుని ప్రభావమునకు లోనగునది. ఒకదాని కంటెను మరియొకటి సూక్ష్మ స్పందనలతో కూడిన శరీరములు ద్వాదశాదిత్యుల ప్రభావమునకు లోనగుచుండును.అయితే శ్రీవల్లభులు ద్వాదశ ఆదిత్యుల కంటెను కూడా అతీతమైన వారు గనుక వారి యొక్క దివ్య స్థూల శరీరము చిత్ర విచిత్రములైన దివ్య స్పందనలను కలిగి ఉండును.

మానవ శరీరముతో శ్రీ పీఠికాపురమున అవతరించుటకు ముందే అనగా 108 సంవత్సరములకు ముందే శ్రీవల్లభులు యీ ప్రదేశమునకు విచ్చేసిరి. నన్ను అనుగ్రహించిరి. ఇప్పుడు కురువపురమున ఏ రూపముతో నున్నారో అదే రూపముతో వారు యిచ్చతకు విచ్చేసిరి. వారి దివ్యలీలలకు అంతెక్కడిది? శ్రీవల్లభులు యిచ్చతకు విచ్చేసిన తదుపరి కొంతసేపటికి హిమాలయమునందలి మహాయోగులు బదరీ మహాక్షేత్రములో శ్రీ బదరీ నారాయణుని బ్రహ్మకమలములతో పూజించిరి. ఆ బ్రహ్మకమలము లన్నియు ఇచ్చట శ్రీ చరణముల కదా పడుచుండుట గమనించితిని. వారు దేశ కాలములకు అతీతులు." అని వచించెను.

నేను శ్రీ పళని స్వామి వారి దివ్య వచనములతో అనిర్వచనీయ అనుభూతిని పొందితిని. "స్వామీ! బ్రహ్మ కమలములనగా నేమి? అవి ఎచ్చట లభించును? వానిచే పూజించిన శ్రీదత్త ప్రభువు సంప్రీతులగుదురని మీ వచనముల వలన తెలియుచున్నది. దయచేసి నా సందేహము తీర్చగోరెదను." అని కోరితిని.

బ్రహ్మ కమలముల స్వరూపముదానికి శ్రీ పళనిస్వామి కరుణాపూరిత దృష్టిని ప్రసరించుచూ యిట్లు తెలియజేసిరి, "శ్రీమహావిష్ణువు సదాశివుని బ్రహ్మకమలములతో పూజించెను. శ్రీ మహావిష్ణువు యొక్క నాభీకమలముగా చెప్పబడినది కూడా బ్రహ్మకమలమే. కమలములతో శ్రీదత్తుని అర్చించిన ఐహికాముష్మిక ఐశ్వర్యము సిద్ధించును. దివ్య లోకములందలి బ్రహ్మ కమలములకు ప్రతిగా యీ భూమండలము నందలి హిమాలయములందు యీ బ్రహ్మకమలములు కాననగును. సుమారు 12 వేల అడుగుల ఎత్తులో హిమాలయములందు సంవత్సరమునకు ఒకే ఒకసారి మాత్రమే యిది పుష్పించును. నాయనా! అర్థరాత్రి సమయము నందు మాత్రమే యిది వికసించుట మరియొక విచిత్రము. ఇది వికాసము చెండునపుడు అద్భుతమైన పరిమళము ఆ ప్రాంతమంతయును నిండిపోవును. హిమాలయమునందలి సాధకులయిన మహాత్ములందరూ యీ అద్భుత దర్శనమునకు రోజుల తరబడి, నెలల తరబడి నిరీక్షింతురు. శరత్కాలము నుండి వసంతకాలము వరకు యిది హిమములో కూరుకుపోయి ఉండును. చైత్రమాస ప్రారంభములో యిది హిమము నుండి బయటపడును. గ్రీష్మ కాలమంతయూ వికాసప్రక్రియ జరుగుచుండును. అమరనాధ్ నందలి అమరేశ్వర హిమలింగ దర్శనమగు శ్రావణ శుద్ధ పూర్ణిమా ప్రాంతము నందు అర్థరాత్రి సమయమందు యిది పూర్ణ వికాసము చెందును. నాయనా! శంకరా! సాధకులు, మహా తపస్వులు , సిద్ధ పురుషుల కోసము మాత్రమే కేవలము హిమాలయములందు మాత్రమే యీ అద్భుత లీల ఇప్పటికినీ, ఎప్పటికినీ జరుగుచుండును. బ్రహ్మకమలము యొక్క దర్శనము వలన సమస్త పాపములు నశించును. యోగ విఘ్నములంతరించును. ఇది సద్యః ఫలితము నిచ్చు అద్భుతలీల. కావున యోగులు, తపస్వులు వారి వారి మార్గములలో ఎంతో ఉన్నతిని పొందెదరు. ఇది వికసించిన తదుపరి, విధి రీత్యా ఎవరికీ దర్శన భాగ్యమున్నదో వారికి ఆ దర్శనభాగ్యము కలిగిన తదుపరి బ్రహ్మ కమలము అంతర్థానమగును.
                                                         బ్రహ్మ కమలములు  


నాయనా! శంకరా! నేను దశదిన దీక్షతో తపస్సమాధిలో ఉండదలచితిని. ఆర్తులైన మానవులు ఎవరయినా వచ్చిన యెడల తపస్సమాధికి భంగము కలుగకుండ నీవును, మాధవుడును దర్శనము చేయించవలసినది. పాము కాటుచే చనిపోయిన వారు ఎవరయినా వచ్చిన యెడల స్వామి యోగసమాధిలో ఉన్దేననియు, అందుచేత శాస్త్రప్రకారము చనిపోయినవారి శరీరమును నదీ ప్రవాహములో విడిచివేయుట గాని, లేదా పూడ్చి పెట్టుట గాని చేయవలసినదని నా ఆజ్ఞగా వారికి తెలుపుదు." అని వచించెను.


శ్రీ పళనిస్వామి తన ఆసనమునందే కూర్చుని తపస్సమాదిలోనికి పోయెను. నేనును, మాధవుడును ఆర్తులైన భక్తులు వచ్చినపుడు ప్రశాంతముగా దర్శనము చేయించుచుంటిమి. వచ్చిన భక్తులలో కొందరు మాకు భోజన సంభారములను సమకూర్చిరి. మాధవుడు వంట చేయు ప్రయత్నములో దాపులనున్న కొబ్బరి చెట్టు నుండి మట్ట రాలిపడుటచే అచ్చటకు పోయి ఆ కొబ్బతి మట్టను తెచ్చి వంట ప్రారంభించెదనని పలికెను. నేను వల్లెయుంటిని. మాధవునితో మరియొకడు బయలుదేరెను. విధి వైపరీత్యము! మాధవుడు కొబ్బరి మట్టను ఎత్తబోవునంతలో కొబ్బరి మట్ట చాటున నున్న త్రాచు పాము మాధవుని కరచెను. ముగ్గురు మనుష్యులు పోయి మాధవుని గుహ దరిదాపులకు తీసుకొని వచ్చిరి.

శ్రీ స్వామిది అనుల్లంఘనీయమైన శాసనమగుటచే మాధవుని నేను పాతిపెట్టితిని. ఖనన సందర్భములో నాకు అచ్చట నున్న భక్త జనులు సహకరించిరి. నేను వెక్కి వెక్కి ఏడ్చితిని. మాధవుని నిష్కల్మష హృదయము, వాని నిర్మల భక్తీ, శ్రీపాద శ్రీవల్లభుల యందు వానికి గల అచంచల విశ్వాసము గుర్తుకు వచ్చి నా మనస్సంతయును కకావికలమయ్యెను. విధి అనుల్లంఘనీయమని సరిపెట్టుకొంతిని. ఈ దుస్సంఘటన తరువాత మరియొక దుస్సంఘటన చూచితిని. ఏడ్పులు పెడబొబ్బలు పెడుతూ 18 సంవత్సరముల ప్రాయము గల ఒక యువకుని శరీరమును వాని సంబంధీకులు తీసుకుని వచ్చిరి. అతడు కూడా పాము కాటు చేతనే మరణించెను. శ్రీస్వామి యోగసమాధిలో నున్నారనియు, వారి ఆజ్ఞ ప్రకారము ఖననము చేయవలసినదనియు తెలిపితిని. అచ్చటనున్న భక్తజనులు, యితని సహచరుడు కూడా ఈ విధముగానే మరణించెననియు, శ్రీస్వామి వారి ఆజ్ఞ ప్రకారము వాని ఖననము కూడ జరిగెననియు తెలిపిరి. వారు విషణ్ణవదనులై గత్యంతరము లేక దుర్విధిని పరిపరివిధములుగా నిందించుకొనుచూ ఆ నవయువకుని ఖననము చేసిరి.

ప్రతీరోజూ ముగ్గురో నలుగురో స్వామివారి దర్శనమునకు వచ్చేదివారు. వారు ప్రశాంతముగా సమాధి స్థితిలోనున్న స్వామివారి దర్శనము చేసుకొని వెళ్ళిపోయెడివారు. ఈ విధముగా పదిరోజులు గడచిపోయెను. పదకొండవ రోజున శ్రీ పళనిస్వామిలో చైతన్యము రాసాగెను. బ్రాహ్మీముహూర్త సమయమున శ్రీ స్వామి చైతన్యస్థులై "మాధవా!" అని పిలిచెను. నేను వెక్కి వెక్కి ఏడ్చుచూ జరిగినదంతయూ వివరించితిని.

అప్పుడు స్వామి నన్ను ఓదార్చి, యోగ దృష్టిని నా వైపు ప్రసరింపచేసెను. ఆ యోగ దృష్టికి నా వెనుబాములో ఏదో సంచలనము కలిగి భరించరాని బాధ కలుగ సాగెను. శ్రీ స్వామి తిరిగి ప్రసన్న దృష్టితో నా వైపు చూసిరి. నా బాధ మటుమాయమయ్యెను. "నాయనా! మాధవునకు శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి స్థూల శరీరముతో లేదు. వాని సూక్ష్మ శరీరము యీ పదిరోజులనుండి కురువపురములో నున్న శ్రీ చరనుల సన్నిధిలో ఉన్నది. ఏది ఏమయినను వాని కోర్కె తీరెను. శ్రీవల్లభుల లీలలు అనూహ్యములు. కాల కర్మ కారణ రహస్యములు ఎవ్వరునూ గ్రహింపజాలరు. అది శ్రీపాదుల వారికి మాత్రమే సాధ్యము. మాధవుని స్థూల శరీరములోనికి ప్రవేశింపజేయవలసిన బాధ్యతను శ్రీపాదులవారు నాకు అప్పగించిరి. మనము ఆ పనిని సత్వరమే నేరవేర్పవలెను." అని శ్రీ పళనిస్వామి సెలవిచ్చెను.

నాకు ఇంతకు ముందు ఉన్న విచారమంతయును క్షణములో మాయమయ్యెను. మాధవుడు పునరుజ్జీవితుడు అగుట కంటె నాకు కావలసినది ఏమున్నది? మాధవుని పాతిపెట్టిన చోటికి వచ్చితిమి. శవము బైటకు తీయబడినది. నాకు సహాయకులుగా మరి ఇద్దరు ఉండిరి. స్వామి మమ్ములను దక్షిణదిక్కుగా నున్న తాటిచెట్ల గుంపు వద్దకు పోయి, "మాధవుని కరచిన ఓ నాగరాజమా! శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ ప్రకారము నీవు శ్రీపళనిస్వామి సన్నిధికి రావలసినదని ఆజ్ఞాపించడమైనది." అని చెప్పమన్న మేము ఆ విధముగనే చేసితిమి.


శ్రీ పళని స్వామి తన కౌపీనము నుండి నాలుగు చిన్ని గవ్వలను తీసెను. వాటిని శవము యొక్క నాలుగు దిక్కులా వద్ద ఉంచిరి. అవి కొంతసేపటికి కొద్దిపాటి ఎత్తునకు ఎగిరినవి. ఆ పిదప రివ్వుమని ధ్వని చేయుచూ ఆకాశములోనికి నాలుగు దిక్కులలోనికి పోయినవి. మరి కొంతసేపటికి బుసలు కొట్టుచూ వచ్చుచున్న నాగుపామును చూచితిమి. అది ఉత్తరదిక్కు నుండి వచ్చుచుండెను. ఆ పాము చాలా అసహనముగా ఉండెను. శ్రీ పళనిస్వామి యొక్క నాలుగు చిన్ని గవ్వలు దాని పాడగా మీద గ్రుచ్చినట్లుగా అంటుకొనిపోయి ఉండెను. శ్రీ పళనిస్వామి ఆ పామును మాధవుని శరీరము నుండి విషమును తీసివేయమని చెప్పెను. పాము ఎచ్చట కరచినదో అచ్చటి నుండియే విషము గ్రహించబడెను. శ్రీ పళనిస్వామి శ్రీపాద శ్రీవల్లభ నామమును స్మరిస్తూ ఆ పాముపై మంత్రోదకమును చల్లిరి. ఆ పాము పళనిస్వామి పాదములను ముద్దుపెట్టుకొని, శ్రీ స్వామికి ముమ్మారు ప్రక్షినము చేసి ప్రశాంతముగా నిష్క్రమించెను.

దత్తభక్తులకు అన్నము పెట్టుట వలన కలుగు ఫలము

శ్రీ పళనిస్వామి యీ విధముగా సెలవిచ్చిరి. "ఈ పాము గత జన్మము నందు స్త్రీ. ఆమె వృద్ధురాలయ్యెను. ఆమె కొంత పాపమును, కొంత పుణ్యమును చేసి యుండెను. ఒక పర్యాయము దత్త భక్తుడైన ఒక బ్రాహ్మణునకు ఆమె అన్నము పెట్టెను. దత్తుడు చాలా సులభముగా ప్రసంనమగు తత్త్వము గలవాడు. ఈమె మరణించిన తరువాత యమలోకమునకు పోయెను. యమధర్మమునకు పోయెను. యమధర్మరాజు యీమెనిట్లు ప్రశ్నించెను. "నీవు కొంత పాపమును, కొంత పుణ్యమును చేసుకొని యుంటివి. దత్త భక్తుడైన బ్రాహ్మణునకు అన్నము పెట్టుట వలన నీకు మహా ఫలము సిద్ధించినది. శ్రీ దత్తాత్రేయుల వారు ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ రూపమున మానవ లోకములో ఉన్నారు. నీ పాపపుణ్యముల ఖాతాలో మార్పు చేయవలసినదియూ, నీకు మహాపుణ్యము కలుగునట్లును, స్వల్పపాపము కలుగునట్లునూ మమ్ములను వారు ఆజ్ఞాపించిరి.. అందుచేత చిత్రగుప్తుల వారు నీ ఖాతాలో మార్పును చేసిరి. నీవు తొలుదొల్తగా పాపమును అనుభవించెదవా? లేక పుణ్యమును అనుభవించెదవా?" దానికి ఆమె స్వల్ప పాపఫలమును అనుభవించి, ఆ తదుపరి పుణ్య ఫలమును అనుభవించెదనని చెప్పినది. అందువలన ఆమె భూలోకములో పాముగా జన్మించినది. ఆమె మనస్తత్వము యితరులకు హాని చేయునది అగుటవలన తనదారికి అడ్డము వచ్చిన వారినందరనూ కరచుచుండెడిది. అందువలన దానికి మరింత పాపఫలము తోడగుచున్నది. నాయనా! సర్పములలో నాలుగు జాతులుండును. మొదటి రకము పాములు ఎవరికి హాని చేయక కేవలము గాలిని ఆహారముగా చేసుకొని యోగుల వలె జీవించును. రెండవ రకము పాములు ఎవరి నీడ అయినా దాని మీద పడిన యెడల క్రోధముతో వారిని చంపివేయును. మూడవ రకము పాములు నరుని కంట పడకుండా ఉండగలందులకు ప్రయత్నించును. ఒకవేళ నరుడు ఎదురయిన యెడల భయముతో పారిపోవును. నాలుగవ రకము పాములు ఎవ్వరునూ తనకు అపకారము చేయకపోయిననూ, నిష్కారణముగా తన కంటపడిన వారిపై పగబట్టి కాటువేయును. ఆ వృద్ధస్త్రీ రజోగుణ పూరితురాలు గనుక తన దాపులకు వచ్చిన మాధవుని కాటు వేసెను. ఆమె పూర్వపుణ్య వశమున మాధవుని కాటి వేసినది. మాధవుడు పూర్వ జన్మములోని పాప వశమున విగతజీవుడయ్యెను. శ్రీపాదుల వారి అనుగ్రహము వలన ఆ వృద్ధ స్త్రీ త్వరలోనే తన నాగ జన్మము నుండి విముక్తురాలై ఉన్నత లోకమును పొందెను. జీవుడు పిండావస్థలో సర్పిలాకారములో ఉండును. నాగదోశము వలన సంతాన నష్టము కలుగును."
యోగ్యులకు అన్నదానఫలము


"శ్రీ దత్తుడు అల్పసంతోషి. శ్రీదత్తుని నామమున ఎవరికయినా అన్నము పెట్టినచో, అన్నగ్రహీత యోగ్యుడయిన యెడల అన్నదాతకు విశేష ఫలము కలుగును. ఆ అన్నసారములోని కొంతభాగము మనస్సుగా మారును. అన్నదాత యొక్క మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, శరీరము మంగళ ప్రదమైన స్పందనలతో నిండును. దానివలన వానికి సృష్టిలోని పదార్థములను ఆకర్షించు శక్తి గలుగును. వస్తు సమృద్ధియే లక్ష్మీ కటాక్షము. ఈ సృష్టి అంతయును సూక్ష్మ స్పందనలతోనూ, సూక్ష్మ నియమముతోనూ పరిపాలించబడుచుండును." అని పళనీస్వామి సెలవిచ్చిరి.


                                 యోగ్యులకు అన్నదానఫలము


శ్రీపాదుల మహిమ 

శ్రీవల్లభుల వారి నామస్మరణము ఎంతటి లక్ష్మీ ప్రదమైనది! వారి అనుగ్రహమును పొందిన వారి అదృష్టమును ఏమని వర్ణించగలము! శ్రీ చరణుల అనుగ్రహ విశేషమున పదిరోజుల క్రితము భూమిలో పాతిపెట్టబడిన మాధవుడు చెక్కుచెదరక ఉన్నాడు. ఇప్పుడు వానికి ప్రాణమును కూడా ప్రసాదించుచున్న శ్రీపాదుల వారి అనుగ్రహమును కరుణను దివ్యలీలను ఏమని వర్ణించగలము?

మాధవునిలో చైతన్యము రాసాగినది. వాడు దాహము కొరకు జలమును కోరెను. వానిని అనునయించుచు పళనీస్వామి నెయ్యి మాత్రమే వాని చేత త్రాగించిరి. ఆ నెయ్యి కూడా వంద సంవత్సరముల క్రితముది. మాధవుడు నెయ్యి పూర్తిగా త్రాగిన తర్వాత కొంతసేపటికి పండ్ల రసమునిచ్చెను. మరికొంతసేపటికి జలమునిచ్చెను.

నాగలోక వర్ణన

మాధవుడు పునరుజ్జీవితుడయ్యెను. మా ఆనందమునకు మితులు లేవు. మాధవుడు యిట్లు చెప్పసాగెను. "నేను సూక్ష్మ శరీరములో కురువపురము చేరుకొంటిని. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఆజానుబాహులు. విశాల నేత్రములు కలవారు. వారి నేత్రముల నిండుగా నిరంతరాయముగా జీవుల యెడ కరుణ, జాలి, ప్రేమ ప్రవహించుచుండెను. నేను స్థూల దేహధారిని కాకపోవుట వలన అచ్చట స్థూల దేహధారులయిన భక్తులకు కనుపించనైతిని. శ్రీవల్లభులు కురువపురములోని ఆ దీవి మధ్య భాగమునకు పొమ్మని అజ్ఞాపించిరి. నేను శ్రీవల్లభుల నామస్మరణము చేసికోనుచూ ఆ దీవి ఒక్క మధ్య భాగము నుండి లోతులలోనికి పోతిని. భూమి యొక్క లోతులలో భూకేంద్రము వద్ద అనేక ప్రాసాదములున్నట్లు కనుగొంటిని. అది పాతాళ లోకమని తెలుసుకొంటిని. స్థూలముగా చూచువారికి అచ్చట స్థూలరూప పదార్థము మాత్రమే గోచరించును. నావలె సూక్ష్మ శరీరములో పోవువారికి అచ్చట సూక్ష్మ రూపమైన లోకము గోచరించును. అచ్చటనున్న నాగజాతి వారు కామరూపధారులు. వారు కోరిన రూపమును ధరించుటకు శక్తి కలిగినవారు. వారు సాధారనముగా నాగరూపములోనే సంచరించుటకు యిష్టపడువారు. అచ్చట నేను అనేక మహా సర్పములను చూచితిని. కొన్ని సర్పములకు వేలకువేలు పడగలున్నవి. పడగలయందు మణులున్నవి. వాటినుండి కాంతిప్రసారము జరుగుచున్నది. కొన్ని నాగులు యోగముద్రలో నున్నట్లు పడగలను విప్పి మోవ్నముద్రలో నున్నవి. ఆశ్చర్యము! అందులో ఒక మహాసర్పముండెను. ఆ సర్పమునకు వేలకువేలు పడగలుండెను. ఆ మహా సర్పముపై శ్రీపాద శ్రీవల్లభులు శ్రీమహావిష్ణువు వలె పవలించియున్దిరి. అచ్చటనున్న మహాసర్పములు వేదగానమును చేయుచున్నవి. స్వామి చిదానందముగా ఆ గానమును వినుచుండెను. నా ప్రక్కనున్న ఒక మహాసర్పము యీ విధముగా చెప్పసాగెను.
శ్రీ దత్తాత్రేయ మహామహిమ 

(మాధవుడు నాగలోకము గూర్చి చెప్పుచూ) నా  ప్రక్కనున్న ఒక మహాసర్పము యీ విధముగా చెప్పసాగెను.

"శ్రీ దత్త ప్రభువులు నేపాళ దేశము నందు గల చిత్రకూటములో 'అనసూయా పర్వతముపై' అత్రి అనసూయలకు పుత్రుడుగా పూర్వయుగములో అవతరించిరి. వారు అవతారమును చాలించకుండా సూక్ష్మరూపం లో నీలగిరి శిఖరమున, శ్రీశైల శిఖరమున, శబరగిరి శిఖరమున, సహ్యాద్రి యందును సంచరించుచుందురు. దిక్కులే అంబరముగా, వస్త్రముగా కలిగిన వారు దిగంబరులని ప్రఖ్యాతి చెందేదారు. సహ్యాద్రి యందు వారు యోగనిష్టులయిరి. వారు నాథ సంప్రదాయనులైన గోరక్షానాధునకు కూడా క్రియా యోగమును ఉపదేశించిరి. జ్ఞానేశ్వరుడను యోగికి ఖేచరీ ముద్రలో కూర్చున్న నిరాకార యోగి రూపములో వీరు దర్శనమిచ్చిరి. వీరు దేశ కాలములకు అతీతులు. శ్రీ ప్రభువు సన్నిధిలోనున్న మాకు భూత భవిష్య వర్తమానములు వేరు వేరుగా కనిపించవు. మాకు అంతయునూ నిత్యవర్తమానమే."   

అనఘా సమేత దత్తాత్రేయ దర్శన 

నా ప్రక్కనున్న మరియొక మహా సర్పము "నాయనా! మాధవా! మమ్ములను కాలనాగులని ఋషీశ్వరులందురు. శ్రీదత్తుడు వేలకువేల సంవత్సరములు రాజ్య పరిపాలన చేసిన తరువాత తన రూపమును గుప్తపరచుకొనగోరెను. వారు నదిలో నీట మునిగి కొన్ని సంవత్సరములుండిరి. ఆ పైన నీటిపైకి వచ్చిరి. వారి అనుచరులమైన మేము తిరిగి వారు మాతో వచ్చుడురని అచ్చటనే యుంటిమి. వారు మా నుండి మరుగుపరచుకొనుటకు యత్నించుచున్నారని మాకు తెలియును. వారు తిరిగి నీట మునిగి కొన్ని సంవత్సరముల తర్వాతా పైకి వచ్చిరి. అయితే యీ సారి వారి చేతిలో 16 సంవత్సరముల వయసు ఉన్న సొగసుగత్తె ఉండెను. మధుపానమత్తుడును, స్త్రీలోలుడును అయిన యితనినా మనము ఇంతవరకు దైవమని భ్రమించితిమని అనుకొని మేము మరలిపోతిమి. వారు అదృశ్యులైరి. వారు అదృశ్యులైన తదుపరి మాకు జ్ఞానోదయమైనది. వారిచేతిలో నున్న మధుపాత్ర యోగానంద రూపమైన అమృతమనియు, ఆ సొగసుగత్తె త్రిశక్తి రూపిని అయిన అనఘాలక్ష్మీదేవి అనియు మాకు స్ఫురించెను. తిరిగి వారిని యీ భూమి పై అవతరింప జేయుటకు ఘోరతపస్సు చేసితిమి. శ్రీదత్తుల అనుగ్రహమున శ్రీ పీఠికాపురములో వారు శ్రీపాద శ్రీవల్లభావతారమును దాల్చిరి.

శ్రీ కురువపుర వర్ణన

ఆనాడు వారు ఎచ్చోట స్నానార్థము నీట మునిగిరో అదే యీ పరమ పవిత్రమైన కురువపురము. వారు జలసమాధిలో నున్నట్లే మేమును మా సూక్ష్మ స్పందనలతో యీ సూక్ష్మ లోకమున యోగసమాధిలోనున్నాము. కౌరవపాండవులకు మూల పురుషుడైన "కురు" అను మహారాజునకు జ్ఞానోపదేశము చేసిన కురుపురమే యీ పవిత్రస్థలము. నాయనా! మాధవా! ఈ కురుపుర మహత్యము వర్ణించుట ఆది శేషునకయినను తరము కాదు.

సదాశివ బ్రహ్మేంద్ర పూర్వగాధ

శ్రీపాద శ్రీవల్లభుల శ్రీ చరణములకు నేను ప్రణమిల్లితిని. శ్రీవల్లభులు కరుణాంతరంగులై "వత్సా! యీ నా దివ్య భవ్య దర్శనము గొప్ప అలభ్య యోగము. నీతో మాట్లాడిన ఒక మహాసర్పము రాబోవు శతాబ్దములలో జ్యోతి రామలింగస్వామి రూపమున అవతరించి జ్యోతి రూపముగానే అంతర్ధానమగును. నీతో మాట్లాడిన మరియొక మహాసర్పము సదాశివ బ్రహ్మేంద్ర నామమున రాబోవు శతాబ్దములలో భూమి మీద అనేక లీలలను చూపును. శ్రీ పీఠికాపురము నాకు అత్యంత ప్రీతిపాత్రము. నా పాదుకలు పీఠికాపురములో ప్రతిష్టింపబడును. నేను జన్మించిన నా మాతామహాగృహము నందే నా పాదుకలు ప్రతిష్టింపబడును. నా జన్మకర్మలు దివ్యములు. అవి రహస్యములు. అవి గోపనీయములు. నీవు శ్రీ పీఠికాపురములో నా పాదుకలు ప్రతిష్టింపబడు స్థలము నుండి పాతాళమును చేరి అచ్చట తపోనిష్టలో నున్న కాలనాగులను కలుసుకొని రమ్మనిరి." 

శ్రీ పళనీస్వామి మందహాసము చేయుచూ, "నాయనా! మాధవా! పీఠికాపురము నందలి కాలనాగులను గూర్చి తదుపరి చెప్పవచ్చును. మనము సత్వరమే స్నానము పూర్తిచేసి ధ్యానము చేయవలెను. ఇది శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞ." అని తెలిపెను.

                                       శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

Related Posts

sripada srivallabha charitamrutam chapter - 3 | శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము-3 | sripada.co
4/ 5
Oleh

Subscribe via email

Like the post above? Please subscribe to the latest posts directly via email.

Powered by Blogger.